రేవంత్ దూకుడు.. కేసీఆర్‌, జ‌గ‌న్ కుట్ర‌లు బ‌హిర్గ‌తం!

తెలంగాణలో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ  పేద‌లు, మ‌ధ్య‌త‌రగ‌తి వ‌ర్గాల‌ సంక్షేమ‌మే ధ్యేయంగా దూసుకెళ్తోంది.. సీఎం రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో పాల‌న సాగిస్తూ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నారు. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల అమ‌లుపై దృష్టి సారించారు. ఆరు గ్యారెంటీ ప‌థ‌కాల‌ను రేవంత్ స‌ర్కార్ ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తోంది. కొత్త‌గా అధికారంలోకి ప్ర‌భుత్వానికి ఏ ప్ర‌తిప‌క్ష పార్టీఅయిన క‌నీసం నాలుగైదు నెల‌లు స‌మ‌యం ఇస్తుంది. ఈ స‌మ‌యంలో ప్ర‌భుత్వం కుదురుకొని ఒక్కో ప‌థ‌కాన్ని అమ‌లు చేసే అవ‌కాశం ఉంటుంది. కానీ, తెలంగాణ‌లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ ఎస్ పార్టీ మాత్రం అధికారం కోల్పోయిన మ‌రుస‌టి రోజునుంచే కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు దాడి మొద‌లు పెట్టింద‌న్న విమర్శ.. రాజకీయవర్గాలలోనే కాకుండా  ప్ర‌జ‌ల నుంచి కూడా గట్టిగా వినిపిస్తోంది.  విద్యుత్ స‌ర‌ఫ‌రా విష‌యంపై బీఆర్ ఎస్ నేత‌లు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. వాటిని తిప్పికొడుతూ రేవంత్ స‌ర్కార్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా  అందిస్తోంది.  ఫ‌లితంగా విద్యుత్ విష‌యంలో బీఆర్ ఎస్ విమ‌ర్శ‌ల‌కు చెక్ ప‌డిన‌ట్ల‌యింది. 

మ‌రో రెండుమూడు నెల‌ల్లో లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ‌లో మొత్తం 17 లోక్ స‌భ స్థానాలు ఉన్నాయి. 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గ‌తంలో అధికారంలోఉన్న బీఆర్ ఎస్ పార్టీ తొమ్మిది ఎంపీ స్థానాల‌ను గెలుచుకుంది. కాంగ్రెస్ మూడు, బీజేపీ నాలుగు, ఎంఐఎం ఒక స్థానంలో విజ‌యం సాధించాయి. ఈసారి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో క‌నీసం 12 నుంచి 15 స్థానాల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాల‌కు ప‌దునుపెడుతోంది. ఆచి తూచి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తోంది.  ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, రేవంత్ స‌ర్కార్ నిర్ణయాల‌తో ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం పెరిగింది. రేవంత్ స‌ర్కార్ పై ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌తో బీఆర్ ఎస్ శ్రేణుల్లో కొంత ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంద‌న్న వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వంకు వ‌స్తున్న మ‌ద్ద‌తును దెబ్బ‌కొట్టేందుకు బీఆర్ ఎస్ అదిష్టానం అనేక  ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌తిప‌క్ష పార్టీ వ్యూహాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొడుతూ కాంగ్రెస్ శ్రేణుల్లో మ‌రింత జోష్ నింపుతున్నారు.   

తాజాగా బీఆర్ ఎస్ నేత‌లు కృష్ణా జ‌లాల నీటివాటాల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. కృష్ణా న‌దిపై ఉన్న ఉమ్మ‌డి ప్రాజెక్టుల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేబీఆర్ ఎంబీకి అప్ప‌గించింద‌ని బీఆర్ ఎస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ప‌రిపాల‌న చేత‌కాద‌ని అన‌డానికి ఇదిఒక ఉదాహ‌ర‌ణ అంటూ ప‌లువురు నేత‌లు పేర్కొన్నారు. బీఆర్ ఎస్ నేత‌ల వ్యాఖ్య‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప్రెస్ మీట్ పెట్టిమ‌రీ సీఎం కేసీఆర్ వ‌ల్ల‌నే నేడు ఈ ప‌రిస్థితి వ‌చ్చిదంటూ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. కృష్ణా, గోదావ‌రిపై ఉన్న‌ప్రాజెక్టుల‌ను కేంద్రానికి స్వాధీనం చేయాల‌ని విభ‌జ‌న చ‌ట్టంలోనే ఉంద‌ని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం త‌న‌ను అడిగే విభ‌జ‌న చ‌ట్టంలోని ప్ర‌తి అంశం రాసింద‌ని కేసీఆర్ చెప్పార‌ని, బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌ను కాంగ్రెస్ పై వేయాల‌ని చూస్తున్నారంటూ బీఆర్ ఎస్ నేత‌లు చేస్తున్న వాద‌న‌ల‌కు రేవంత్‌ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

 కృష్ణా న‌దిలో 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాల‌నే దానిపై కేంద్రం క‌మిటీ వేసింది.. ఏపీకి 512, తెలంగాణ‌కు 299 టీఎంసీలు ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించారు. దీనికి అప్ప‌టి సీఎం కేసీఆర్‌, అధికారులు అంగీక‌రించి సంత‌కాలు చేశార‌ని రేవంత్ బ‌హిర్గ‌తం చేశారు. కేసీఆర్‌, హ‌రీశ్ రావు నీటి పారుద‌ల శాఖ మంత్రులుగా ఉన్న‌ప్పుడే ప్రాజెక్టుల‌ను కేంద్రానికి అప్ప‌గించారు.. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేంద్రానికి ప్రాజెక్టుల‌ను అప్ప‌గిస్తోంద‌ని అబ‌ద్దాలు చెబుతున్నార‌ని రేవంత్ చెప్పారు. రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ద్వారా రోజుకు 8  టీఎంసీలు త‌ర‌లించ‌డానికి ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌ణాళిక వేశారు.. అందుకు కేసీఆర్ అనుమ‌తిచ్చారు.. 5మే 2022న ఈ మేర‌కు జీవో ఇచ్చారని రేవంత్ చెప్పారు. జ‌గ‌న్‌, కేసీఆర్ ఏకాంత చ‌ర్చ‌ల్లో ఏం కుట్ర చేశారో? ఎత్తిపోత‌ల ద్వారా జ‌గ‌న్ రోజుకు 8 టీంఎసీల నీటిని తీసుకెళ్తుంటే.. కేసీఆర్ కేవలం రెండు టీఎంసీల కోసం రూ.ల‌క్ష‌కోట్లు ఖ‌ర్చు పెట్టి కాళేశ్వ‌రం ప్రాజెక్టును నిర్మించే ప్ర‌య‌త్నం చేశారంటూ రేవంత్‌, ఉత్త‌మ్ లు అన్నారు. మొత్తానికి లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యం ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కృష్ణా న‌దీ జ‌లాల విష‌యంలో దుమ్మెత్తిపోయాల‌ని చూసిన బీఆర్ ఎస్ నేత‌ల ఆశ‌ల‌పై రేవంత్ స్ట్రాంగ్ కౌంట‌ర్ తో నీళ్లుచ‌ల్లిన‌ట్ల‌యింద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu