రాజీనామా చేయలేదన్న త్రివేది
posted on Mar 15, 2012 12:40PM
న్యూఢి
ల్లీ: తాను రాజీనామా చేయలేదని దినేష్ త్రివేది గురువారం చెప్పారు. మమతా బెనర్జీ, మన్మోహన్ సింగ్ చెప్తే వెంటనే రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. రైల్వే చార్జీలు పెంచే విషయాన్ని తాను మమతా బెనర్జీకి ముందుగానే చెప్పానని ఆయన అన్నారు. గురువారం తాను పార్లమెంటులో ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉందని, ఆ పని చేస్తానని ఆయన చెప్పారు. మమతా బెనర్జీ గానీ, ప్రధాని గానీ చెప్తే తాను మరుక్షణమే రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. చార్జీల పెంపును ఆయన మరోసారి సమర్థించుకున్నారు. దేశ ప్రయోజనాలను, రైల్వే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ పనిచేసినట్లు ఆయన తెలిపారు. తాను క్రమశిక్షణ గల పార్టీ సైనికుడినని, పార్టీ చెప్పినట్లు నడుచుకుంటానని ఆయన అన్నారు. దినేష్ త్రివేది స్థానంలో ముకుల్ రాయ్‌ని రైల్వే మంత్రిగా తీసుకోవాలని తాను ప్రధానికి లేఖ రాసినట్లు మమతా బెనర్జీ చెప్పారు.
మమతా బెనర్జీని ఇరకాటంలో పెట్టేందుకే దినేష్ త్రివేది రాజీనామా డ్రామా నడిచినట్లు చెబుతున్నారు. త్రివేది వ్యవహారంపై గురువారం రాజ్యసభ రగడ చోటు చేసుకుంది. మమతా బెనర్జీ నుంచి తమకు లేఖ మాత్రమే వచ్చిందని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. త్రివేది నుంచి రాజీనామా లేఖ అందలేదని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. మమతా బెనర్జీ ఆదేశాల మేరకు దినేష్ త్రివేది రాజీనామా చేశారని, ఆ రాజీనామాను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆమోదించారని నిర్ధారిస్తూ వార్తలు వచ్చిన విషయం విదితమే.