ఉగ్రవాదులను స్మగ్లర్లను ప్రభుత్వాలు ఉపేక్షించాలా?

 

తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకేసారి ఇంచుమించు ఒకే రకమయిన పరిస్థితులను ఎదుర్కోవలసి రావడం చాలా విచిత్రమే. తిరుపతి సమీపంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ కారణంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కొంటుంటే, జనగామలో జరిగిన ఎన్కౌంటర్ లో ఉగ్రవాది వికారుద్దీన్ ముఠాని పోలీసులు మట్టుబెట్టడాన్ని తెలంగాణాలో మజ్లీస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. అయితే రెండు రాష్ట్రాలలో జరిగిన ఎన్కౌంటర్లలో చనిపోయినవారు తీవ్ర నేరానికి పాల్పడిన వారు లేదా పాల్పడుతున్నవారే.

 

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగిలింగ్ ఈరోజు కొత్తగా మొదలయిందేమీ కాదు. అనేక ఏళ్లుగా కొందరు రాజకీయ నాయకులు, పలుకుబడిగల వ్యక్తుల అండదండలతో సాగుతూనే ఉంది. వారిలో రాష్ట్రానికి చెందినా కొందరు రాజకీయ ప్రముఖుల హస్తం ఉందని వార్తలు వచ్చేయి. అయితే ఇంతవరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత కటినంగా వ్యవహరించకపోవడం వలన ఎర్రచందనం స్మగిలింగ్ యదేచ్చగా కొనసాగుతోంది.

 

రాష్ట్ర అటవీ శాఖ లేదా అధీకృత వ్యక్తులు ఇంతవరకు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికిన దాఖలాలు లేవు. కానీ స్మగ్లర్లు మాత్రం నిత్యం ఎర్రచందనం చెట్లను నరికి స్మగిలింగ్ చేస్తూనే ఉన్నారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఎన్నిసార్లు పట్టుకొన్నప్పటికీ రాజకీయ పలుకుబడి గల స్మగ్లర్లు తమిళనాడు నుండి కూలీలను తీసుకువచ్చి మరీ లారీలలో ఎర్రచందనం తరలించగలుగుతున్నారంటే వారు ఎంత బరి తెగించిపోయారో అర్ధమవుతుంది. అంతేగాక తమను అడ్డుకొన్న అటవీ శాఖ సిబ్బందిపై దాడులు చేసి అధికారులను చంపిన సంఘటనలు కూడా గతంలో జరిగాయి. కానీ అప్పుడు ఏ మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా స్పందించిన దాఖలాలు లేవు.

 

తమ రాష్ట్రానికి చెందిన కూలీలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిత్యం అరెస్టులు చేస్తున్నప్పుడు కూడా తమిళనాడు ప్రభుత్వం ఈ వ్యవహారంతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేదన్నట్లు వ్యవహరించింది తప్ప వారికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ఎన్నడూ చేయలేదు. కానీ ఇప్పుడు అమాయకులయిన తమ కూలీలను ఆంధ్రా పోలీసులు కిరాతకంగా చంపారని తమిళనాడులో రాజకీయ పార్టీలు, తమిళనాడు ప్రభుత్వం, మానవ హక్కుల సంఘాలు, రాష్ట్రంలో ప్రతిపక్షాలు మూకుమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

 

కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సుపై నెల్లూరు సరిహద్దులో దుండగులు దాడి చేయడాని కానీ, బస్సులోకి పెట్రోల్ బాంబు విసరడాన్ని కానీ తప్పు పట్టడం లేదు. కనీసం దాని గురించి మాట్లాడలేదు కూడా. మానవ హక్కులు గురించి గొంతు చించుకొని అరుస్తున్న వారు బస్సులో ఉన్న ప్రయాణికులపై పెట్రోల్ బాంబు విసరడాన్ని ఎందుకు తప్పుపట్టడం లేదు అంటే బస్సులో ప్రయాణికులు ఎవరూ చనిపోలేదు గనుక అని సరిపెట్టుకోవలసి ఉంటుందేమో?

 

ఈ ఎన్కౌంటర్లో కూలీలే మరణించి ఉండవచ్చును. కానీ ఇటువంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నప్పుడు ఇటువంటి పరిణామాలే ఎదురయ్యే ప్రమాదం ఉందని తెలిసే వచ్చేరు. ఒకవేళ వారు తమ స్వంత రాష్ట్రంలోనే ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడితే అప్పుడు తమిళనాడు ప్రభుత్వం వారిని ఉపేక్షిస్తుందని ఎవరూ భావించారు. కానీ అంతమాత్రాన్న వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడం న్యాయమణి సమర్ధించలేము కూడా. కానీ పోలీసులు హెచ్చరించినప్పుడు వారు లొంగిపోయుంటే షరా మామూలుగా వారినందరినీ అరెస్ట్ చేసి ఇంతకు ముందులాగే జైలుకి తరలించేవారు. అప్పుడు ఆ వార్త షరా మామూలుగానే మీడియాలో కనబడేది. కానీ ఈసారి వారు తెగించి ప్రతిదాడులకి పాల్పడటం వలననే తాము ఆత్మరక్షణ కోసం వారిపై కాల్పులు జరపవలసి వచ్చిందని పోలీస్ అధికారులు చెపుతున్న మాట వాస్తవమని నమ్మక తప్పదు.

 

కనుక ఈ సంఘటన నుండి తమిళనాడు ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవలసి ఉంది. ఇప్పటికయినా మేల్కొని తమ రాష్ట్ర కూలీలను ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన కుండా కట్టుదిట్టమయిన చర్యలు చేప్పట్టవలసి ఉంది. ఇక పోలీసులు కూడా రాష్ట్రానికి, ప్రజలకి, ప్రభుత్వానికి భద్రత కల్పించడానికే పరిమితమవ్వాలి తప్ప వారి వలన రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త సమస్యలు సృష్టించకూడదు. సున్నితమయిన ఇటువంటి వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరమని ఈ సంఘటన, దాని విపరీత పరిణామాలు తెలియజేస్తున్నాయి.

 

ఇక తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన కరుడుగట్టిన తీవ్రవాది అనేక నేరాలకు పాల్పడిన వికారుద్దీన్ అతని అనుచరుల ఎన్కౌంటర్ పై కూడా తెలంగాణాలో మజ్లీస్ పార్టీ యంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించడం విస్మయం కలిగిస్తోంది. అటువంటి సంఘ విద్రోహ వ్యక్తులు తప్పించుకొని పారిపోతుంటే పోలీసులు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చొని ఉంటే వారు హైదరాబాదులోనే మరొక చోటనో బాంబు ప్రేలుళ్ళకు పాల్పడి అమాయకులయిన ప్రజల ప్రాణాలు బలిగొనకుండా ఊరుకోరని అందరికీ తెలుసు. అందుకే వారి చావుకి ప్రజలెవ్వరూ కించిత్ విచారం వ్యక్తం చేయడం లేదు. కానీ వారు ముస్లిములనే ఏకైక కారణంతో వారిని వెనకేసుకు వస్తే అంతకంటే అవివేకమ మరొకటి ఉండబోదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా వంటి పూర్తి ముస్లిం దేశాలలో ప్రజలణి అభం శుభం తెలియని చిన్నారులను పొట్టనబెట్టుకొంటున్న ఉగ్రవాదులు ఎవరినీ ఉపేక్షించరనే సంగతి తెలిసిన తరువాత కూడా అటువంటి వారికి మతం పేరిట వంతపాడటం అవివేకం.