రామ్ గోపాల్ వర్మ సినిమాకి వివాదం తప్పదా?

 

 

వివాదం లేకపోతే అది రామ్ గోపాల్ వర్మ సినిమా కాదని జనం నమ్మే పరిస్థితి ఉందిప్పుడు. మొదట్లో ‘శివ’, ‘క్షణ క్షణం’ వంటి విలక్షణమయిన అనేక మంచి సినిమాలు తీసిన అయన, ఆ తరువాత అండర్ వరల్డ్ గ్యాంగులు, డాన్ల సినిమాల వైపు మళ్ళారు. ఆ తరువాత దెయ్యాలు భూతల వెంట పడ్డారు కొన్నాళ్ళు. తరువాత రక్త చరిత్ర, బెజవాడ రౌడీలు వంటివి రాజకీయ, ఫాక్షనిస్ట్ సినిమాలు తీసి వివాదాలు తలకెత్తుకొన్నారు.

 

అంతవరకూ తీసిన ప్రతీ సినిమా కూడా ఒక వివాదస్పదమే అయ్యింది. అయినా, అందుకు ఆయన బాధ పడలేదు సరికదా చాలా గర్వపడ్డారు. మళ్ళీ, ఇప్పడు ముంబాయి ఉగ్రవాదుల దాడిని కధాశంగా తీసుకొని '26/11 ఇండియాపై దాడి' చిత్రం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా మార్చ్ మొదటివారంలో విడుదల కానున్న సమయంలో ఈసారి కూడా సినిమాపై వివాదం మొదలయింది. రామ్‌ప్రసాద్ అనే ఒక లాయర్ ఈ సినిమా విడుదల అయితే మతకల్లోల్లాలు చెలరేగే అవకాశం ఉంది గనుక, దానిని విడుదల చేయకుండా నిలిపేయవలసిందిగా కోరుతూ సెన్సార్ బోర్డుకు లేఖ వ్రాసారు. కానీ, ఆయన లేఖపై సెన్సార్ బోర్డు ప్రతిస్పందన ఇంకా తెలియలేదు.