సంగారెడ్డిలోనే రాహుల్‌ సభ ఎందుకు? నానమ్మ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందా?

 

నానమ్మ సెంటిమెంట్ ను ఇప్పుడు మనువడు ఫాలో అవుతున్నాడు. ఓడిన చోటే గెల్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. అందుకే నానమ్మ బాటలో సంగారెడ్డి నుంచి సమర శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమయ్యాడు రాహుల్‌. ప్రభుత్వ వైఫల్యాలను నానమ్మ ఇందిరాగాంధీలాగే ఎండగట్టి తిరిగి కాంగ్రెస్‌ను ప్రజల దగ్గరికి చేర్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.

 

సంగారెడ్డి అంటే కాంగ్రెస్ మొదటి నుంచి సెంటిమెంటుగా భావిస్తుంది. 1979లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. సంగారెడ్డి నుంచే ఎన్నికల శంఖరావాన్ని పూరించారు. మెదక్ ఎంపీగా పోటీచేసి భారీ మెజార్టీ సాధించారు. దేశవ్యాప్తంగా అత్యధిక సీట్లు సాధించి మరోసారి ప్రధాని అయ్యారు. అందుకే సంగారెడ్డి కలిసోస్తుందని పార్టీ పెద్దలకు నమ్మకం. అదే నమ్మకంతో రాహుల్ గాంధీ సభను సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. జూన్ 1న ప్రజా గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 

 

సంగారెడ్డి సెంటిమెంట్ తమకు కలిస్తోందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎమర్జెన్సీ టైమ్‌లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. బడా నేతలకు సైతం కనీసం డిపాజిట్లు రాలేదు. ఇక కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్నారు. అయితే 1979 ఎన్నికల్లో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని సంగారెడ్డి నుంచి ప్రారంభించిన ఇందిరా గాంధీ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. అందుకే సంగారెడ్డిలో రాహుల్ సభ ఏర్పాటు చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ సభ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా... భారీగా ఉచిత హామీలు గుప్పించి... మరోసారి ప్రజలకు చేరువై 2019 ఎన్నికల్లో పుంజుకోవాలని చూస్తున్నారు. మరి సంగారెడ్డి సెంటిమెంట్ కాంగ్రెస్ కు కలిసొస్తుందా లేదా అన్నది ఎన్నికల తర్వాతే తేలుతుంది.