ప్రశ్నార్ధకంగా మారిన రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ !

 

పదేళ్ళు నిరాటంకంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని చాలా నెలల ముందే పసిగట్టింది. ఎన్నికలలో విజయం సాధిస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, ఆయనకు పార్టీ పూర్తి బాధ్యతలు అప్పగించకపోవడమే అందుకు నిదర్శనమని చెప్పవచ్చును. కానీ ఓటమిని ముందే పసిగట్టినప్పటికీ వెంటనే దిద్దుబాటు చర్యలు చేప్పట్టకుండా తప్పు మీద తప్పులు చేసుకొంటూ ముందుకు సాగడంతో ఎన్నికలలో ఘోర పరాభవం పొందింది. ఆంద్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన చేసిన తీరు కాంగ్రెస్ కొంప ముంచితే, ఉత్తరాదిన ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేక కారణం, ప్రత్యేక పరిస్థితుల వలన కాంగ్రెస్ ఘోరపరాజయం పొందింది. నాటి నుండి కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది.

 

సోనియా, రాహుల్ గాంధీ లకు వంగి వంగి నమస్కారాలుచేసే వీ.హనుమంత రావు వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు అధిష్టానం చేసిన పొరపాట్లు కూడా పార్టీ ఓటమికి కారణమయ్యాయని దైర్యంగా విమర్శించడం గమనిస్తే, పార్టీపై సోనియా, రాహుల్ గాంధీల పట్టు కోల్పోతున్నట్లు అర్ధమవుతుంది. అందుకే పార్టీపై అదుపుకోల్పోక ముందే జాగ్రత్తపడుతూ రాహుల్ గాంధీని పక్కకు తప్పించి మళ్ళీ సోనియాగాంధీ పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఈ విషయాన్ని వారిరువురికీ అత్యంత సన్నిహితుడుగా మెలిగే శశీధరూర్ స్వయంగా దృవీకరించారు కూడా. అయితే రాహుల్ గాంధీని పక్కనబెట్టినట్లు ఆయన అన్న మాటలపై పార్టీలో దిమారం చెలరేగడంతో, పార్టీలో రాహుల్ గాంధీ ప్రాధాన్యం ఎప్పుడూ తరగలేదని, ఆయన తన తల్లికి అండగా ఉంటారని సర్ది చెప్పుకొన్నారు.

 

అంటే 120 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని ప్రధానమంత్రిగా ఏలేందుకు సిద్దపడిపోయిన రాహుల్ గాంధీ కనీసం కాంగ్రెస్ పార్టీని కూడా నడిపించలేరని స్పష్టమవుతోంది. సోనియా గాంధీ మళ్ళీ రంగంలోకి దిగడంతో దానిని ద్రువీకరించినట్లయింది. ఆయన కనీసం పార్లమెంటులో పార్టీకి నాయకత్వం వహించడానికి కూడా వెనుకాడారు. తల్లి సోనియాగాంధీ, సీనియర్లు పార్టీని నడిపిస్తుంటే ఆయన పార్లమెంటులో హాయిగా కునుకు తీస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ వంశపారంపర్య పాలన అనివార్యం అని భావిస్తునంత కాలం ఆయన హాయిగా అలా కునుకు తీయవచ్చును. అందువల్ల ఆ పార్టీని ఎంతగా ప్రక్షాళన చేసినప్పటికీ, దానిని నడిపించే నాయకుడు సమర్ధుడు కానప్పుడు ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం పొందాలంటే ముందుగా ఈ తల్లీకొడుకుల చెర నుండి బయటపడి సమర్దుడయిన నాయకుడు దాని పగ్గాలు చేబట్టవలసి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యం కాదు గనుక, పార్టీ పునర్వైభవం కూడా సాధ్యం కాకపోవచ్చును.

 

అన్నివిధాల సమర్ధుడు, మంచి రాజకీయ అనుభవశాలి అయిన నరేంద్ర మోడీ ఇప్పుడు దేశప్రధానిగా అధికారం చేప్పట్టి రానున్న ఐదేళ్ళలో దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే, ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందేలా చేయగలిగినట్లయితే, ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉండకపోవచ్చును.

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నగత పదేళ్ళ కాలంలో పూర్తి సానుకూల వాతావరణం ఉనప్పటికీ పార్టీపై పట్టు సాధించలేకపోయిన రాహుల్ గాంధీ, ఇప్పుడు పార్టీలో వ్యతిరేఖత ఎదుర్కొంటూ రానున్న ఐదేళ్ళలో పార్టీపై పట్టు సాధిస్తారని ఎవరూ భావించలేరు. కనుక ఈ దేశ వ్యాప్తంగా ఉన్న వేలాది కాంగ్రెస్ నేతలు, లక్షలాది కార్యకర్తల భవిష్యత్ ఏమవుతుందనే సంగతి పక్కన బెడితే, దేశ ప్రధాని కావాలనుకొన్న రాహుల్ గాంధీ భవిష్యత్ ఏమవుతుందనే ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది.