మళ్లీ తెరపైకి రాహుల్ గాంధీ పౌరసత్వం.. వివరణ ఇవ్వాలని నోటీసులు
posted on Mar 14, 2016 11:22AM
.jpg)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఎప్పటినుండో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తన పౌరసత్వంపై రాహుల్ కు ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. తాజాగా మళ్లీ రాహుల్ కు పౌరసత్వంపై చిక్కులు వచ్చి పడ్డాయి. అసలు సంగతేంటంటే.. రాహుల్ భారతీయుడు కాదని.. తనకి బ్రిటన్ పౌరసత్వం ఉందని ఆరోపణలు వచ్చాయి. రాహుల్ కు బ్రిటన్లో ఓ కంపెనీ ఉందని.. దానికి సంబంధించిన పత్రాలలో రాహుల్ తాను బ్రిటన్ వారసత్వానికి చెందిన వాడినని చెప్పినట్టు.. భాజపా నేత సుబ్రమణ్యస్వామి ఎప్పటినుండో ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ చెప్పారు. అయితే ఇప్పుడు దీనిపై కేంద్రమంత్రి మహేశ్ గిరి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేయడంతో.. స్పీకర్ ఈ ఫిర్యాదును పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీకి పంపించారు. దీనిపై విచారణ జరిపిన పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ రాహుల్ తన పౌరసత్వంపై వెంటనే విచారణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈవ్యవహారంపై మండిపడుతోంది. స్పీకర్ ఫిర్యాదు చేసేముందు రాహుల్ గాంధీని సంప్రదించాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి రాహుల్ కు ఈ వారసత్వం గురించిన తలనొప్పులు ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడంలేదు.