కాంగ్రెస్ లో అధికార వికేంద్రీకరణ సాధ్యమేనా

 

ఇటీవల రాహుల్ గాంధీ ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీజేపీ అధికారాన్ని మోడీ ద్వారా కేంద్రీకృతం చేయాలని భావిస్తుంటే, తాను అధికార వికేంద్రీకరణ జరిగి, సామాన్యులు కూడా అందులో భాగాస్వాములవ్వాలని కోరుకొంటున్నాని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అధికార (వి)కేంద్రీకరణ ఎంత గొప్పగా అమలవుతోందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నఏ రాష్ట్ర ప్రభుత్వమయినా ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నావెంటనే డిల్లీకి పరిగెత్తడం అందరూ చూస్తేనే ఉన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదన్నట్లు హైకమాండ్ ఆజ్ఞ లేనిదే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ నిర్ణయమూ స్వయంగా తీసుకోలేవని అందరికీ తెలుసు. అయినా యువరాజవారు అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడటం చూస్తే ఆయన మాటలకి చేతలకీ పొంతన ఉండదని స్పష్టమవుతోంది. సామాన్యులు అధికారంలో భాగస్వాములవడం మాట దేవుడెరుగు. కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికలలో పోటీ చేయగలవారికే పార్టీలో దిక్కు లేదు.

 

ఇంతకీ ఈ ఉపోద్గాతం అంతా ఎందుంటే, బొత్ససత్యనారాయణ తాను, ముఖ్యమంత్రి, మరికొందరు కాంగ్రెస్ పెద్దలు కలిసి ఎంపిక చేసిన పార్టీ రాజ్యసభ అభ్యర్ధులకు వ్యతిరేఖంగా పోటీలో ఉన్న తిరుగుబాటు అభ్యర్ధులు వెంటనే పోటీ నుండి విరమించుకోవాలని, అదేవిధంగా కాంగ్రెస్ శాసనసభ్యులందరూ విధిగా పార్టీ అభ్యర్దులకే ఓటేయాలని, అలా కాకుండా ఇతరులకి ఓటేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

 

ఆయన, తను మరి కొందరు కాంగ్రెస్ పెద్దలు కలిసి అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసామని చెపుతున్నారు. కానీ, నిజానికి వారు అభ్యర్ధుల జాబితాను పట్టుకొని డిల్లీ వెళ్లి అధిష్టానం ఆమోదముద్ర వేయించుకోకుండా తమంతట తాము అభ్యర్ధులను ఖరారు చేయలేరు. మరప్పుడు ఎవరికీ కూడా ఈ అధికార వికేంద్రీకరణ గురించి ఆలోచన కూడా రాలేదు. చివరికి కాంగ్రెస్ శాసనసభ్యులు ఎవరికి ఓటు వేయాలో కూడా పార్టీయే నిర్ణయిస్తుంది. బహుశః అది కూడా అధికార (వి) కేంద్రీకరణగానే అందరూ అర్ధం చేసుకోవలసి ఉంటుంది.

 

ప్రధానమంత్రయి దేశాన్ని ఏలాలనుకొంటున్న రాహుల్ గాంధీ, కీలకమయిన రాష్ట్ర విభజన సమస్య గురించి ఎన్నడూ దైర్యంగా మాట్లాడలేదు. సమస్యను సామరస్యంగా పరిష్కరించలేకపోయారు. ఆ భాద్యతను పార్టీ సీనియర్ల నెత్తిన పడేసి, వీలుచిక్కినప్పుడల్లా తను ఆచరించి చూపలేని తన ఆశయాలు గురించి ఈవిధంగా ఉపన్యాసాలు ఇవ్వడం వలన ఆయనకి కానీ, పార్టీకి గానీ ఒరిగేదేమీ ఉండదు. అసలు స్వంతపార్టీలోనే ముఖ్యమంత్రితో సహా నేతలందరూ పార్టీపై తిరుగుబాటు చేస్తున్నప్పుడు, ముందుగా పార్టీని చక్కబెట్టుకోకుండా దేశాన్ని చక్కబెట్టేస్తానని చెప్పడం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది.