మార్పు విద్యార్ధుల్లో రావాలి!
posted on Sep 25, 2012 8:54AM
.png)
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ ఘటనలకు తావులేకుండా పటిష్టచర్యలు తీసుకోవాలని అన్నిజిల్లాల ఎస్పీ, పోలీస్ కమిషనర్‌లకు డిజిపి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అలాగే ర్యాగింగ్ బాధితులకు పూర్తి రక్షణ కల్పించాలని, ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ర్యాగింగ్ జరక్కుండా చర్యలు తీసుకోవాలని, వైస్ ఛాన్సలర్, ప్రిన్సిపాల్‌లతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని ఓ సర్క్యులర్‌లో సూచించారు. నిజంగా హర్షించదగ్గ పరిణామం. అలాగే గతంలో జరిగిన ర్యాగింగ్‌పై చర్యలు తీసుకుంటున్నామని, ఇక ఎక్కడ ర్యాగింగ్‌లు జరగవని అన్నారు. కాని జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. కొత్త విద్యార్ధులను పరిచయం చేసుకోవడమంటే వారంతా ఎందుకు కాలేజీలో చేరమా? అని బాధపడేలా వుండకూడదు. తల్లిదండ్రులకు దూరంగా చదువుకుంటున్నా మాకు ఓ అండ వుందన్న సంతృప్తితో కాలేజీలకు రావాలి. అలా వారు రావాలంటే ఆయా సంస్థల్లోని విద్యార్ధుల్లో మార్పు రావాలి. ర్యాగింగ్ అంటే మా జన్మహక్కు అన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తుంటారు. కాలేజీల్లోకాని, విద్యార్ధులకు సంబంధించిన హాస్టళ్ళలోకాని ర్యాగింగ్ అన్నది జరగకుండా వుండాలంటే అది ఎంత ఇబ్బందికరమో వారికి తెలియాలి. మా వెనుక అండవుందని కొందరు ప్రవర్తిస్తుంటారు. అటువంటివారికి ఆయా పెద్దలు బుద్ధిచెప్పిననాడు ర్యాగింగ్ అన్నది విద్యాసంస్థల్లో జరగదు. కేవలం మగపిల్లలే ర్యాగింగ్ చేస్తారనుకుంటే పొరపాటే! ఆడపిల్లలు సైతం ర్యాగింగ్ చేసిన సంఘటనల కథనాలు సామాన్య ప్రజలు చదివారు కూడా! ర్యాగింగ్ జరగకుండదంటే ముందు విద్యార్ధుల్లో మార్పువచ్చేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కొందరు విద్యార్ధుల వెనుక వుండి నడిపించే వారు తెలుసుకోవాలి. మరో విద్యార్ధిని ర్యాగింగ్ చేసేముందు ఆ స్థానంలో మనమే ఉంటే ఎలా ఫీలవుతామో ఆలోచించుకుంటే మంచిది.