కాంగ్రెస్ నేత ఫొటోతోనే మీరు ఓట్లు అడుక్కుంటున్నారు

 

కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేకహోదా భరోసా బస్సు యాత్రను.. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకొని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ నేతలు వైసీపీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. తమ భరోసా యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి రౌడీలను పంపించారని ఆరోపించారు. జగన్ రౌడీ పార్టీని  స్థాపించారని ధ్వజమెత్తారు. పదేళ్లు కాంగ్రెస్ లో ఉండి పందికొక్కుల్లా దోచుకున్న వారు మా యాత్రను అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు.

పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఆనం రామనారాయణరెడ్డికి పదవి లేనిదే నిద్రపట్టదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో అనేక ఉన్నత పదవులు అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయిన ఆనంకు నైతిక విలువలు లేవని అన్నారు. మొన్నటిదాకా టీడీపీలో ఉన్నారని, ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నారని, రేపు ఎక్కడుంటారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన మాదిరి కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని.. ఇదే సమయంలో జగన్, ప్రధాని మోదీ కాళ్ల వద్ద రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని స్పష్టం చేసారు. వైసీపీ సహా అన్ని పార్టీల అంగీకారంతోనే ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ విభజించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా బలపడిందని చెప్పారు. వైసీపీ ఓటర్లందరూ కాంగ్రెస్ మద్దతుదారులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఏ ఫొటోతో మీరు ఓట్లను అడుక్కుంటున్నారో.. ఆ ఫొటోలోని వైయస్ రాజశేఖరరెడ్డి కూడా కాంగ్రెస్ వ్యక్తేననే విషయాన్ని గ్రహించాలని అన్నారు.