ఏపీని మరో బీహార్ చేసేందుకు కుట్ర.. వెయ్యి కోట్ల ప్యాకేజీ!!

 

ఏపీ సీఎం చంద్రబాబు.. ఈరోజు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్, జగన్ వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీతో రాష్ట్రంపై కుట్రలు ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రంలో సామంత రాజు వ్యవస్థ తీసుకురావాలన్నదే వీరి ఆలోచనగా ఉందని విమర్శించారు. ఏపీపై ద్వేషం చూపిన కేసీఆర్, కేటీఆర్‌లు జగన్‌పై ప్రేమ చూపుతున్నారని.. రాష్ట్రాన్ని మరో బీహార్  చేసేందుకు ప్రశాంత్ కిశోర్‌ సాయంతో కుట్ర పన్నుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటివాటిని తెలుగుజాతి అంగీకరించదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కుల రాజకీయాలను అంతా వెలివేయాలని కోరారు. సమగ్రాభివృద్దే టీడీపీ లక్ష్యమన్నారు. అభివృద్ధి, మంచి కోరుకునేవారు టీడీపీలో చేరుతున్నారని.. అవినీతి కాంక్షించే వారు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని విమర్శించారు.

ఏపీలో తమ పెత్తనం సాగాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమని చంద్రబాబు ఆరోపించారు. మన ఉలవచారు పశువులు తింటాయి అన్నారని, ఆంధ్రలో ఉండేవాళ్లంతా రాక్షసులే అన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పోలవరంపై కేసీఆర్‌ కుమార్తె కవిత కేసులు వేశారని తెలిపారు. ప్రతిపక్ష నేత జగనే గెలుస్తాడని కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్ అంటున్నారని, వైసీపీకి డబ్బుల మూటలు అందిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌, జగన్ లాలూచీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌కు వంతపాడే వైసీపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు. పోలవరం, రాజధాని పనులపై విషప్రచారం చేశారని దుయ్యబట్టారు. గ్రాఫిక్స్ అన్నవాళ్ల కళ్లు తెరిపించేలా పనులు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.