మొన్న తాను తూలి, నిన్న మాట తూలి.. కాపు కాసే వాడు కాపు

 

ఎన్నికల సమయంలో నాయకులు ఆచితూచి అడుగులు వేయాలి. కొంచెం అటు ఇటైనా ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. వైసీపీ అభ్యర్థి రఘు రామ కృష్ణంరాజు మాత్రం ఒకసారి తాను తూలి, మరోసారి మాట తూలి ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఆయన ఓ సభలో తులూతూ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఆయన మీద విమర్శలు గుప్పించారు. మద్యం తాగి ప్రచార సభకి వచ్చిన ఈయన నాయకుడా? అంటూ కొందరు.. వైసీపీ అధికారంలోకి వస్తే మద్యం నిషేదిస్తాం అంటున్నారు.. ముందు అభ్యర్థులు తాగి ప్రచారానికి రాకుండా చూసుకోండి అంటూ మరికొందరు విమర్శించారు. అయితే ఈ తలనొప్పి చాలదు అన్నట్లు రఘు రామ కృష్ణంరాజు కాపు కులం గురించి మాట్లాడి మరో తలనొప్పి తెచ్చుకున్నారు.

పవన్ కళ్యాణ్ అవినీతిపరుల తాట తీస్తా అంటూ పలుమార్లు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ రఘురామకృష్ణంరాజు కౌంటర్ వేయాలి అనుకున్నారు. కానీ అది కాస్త బెడిసి కొట్టింది. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే.. 'మీరు కాపులు. కాపు కాసే వాడు కాపు. మీ పని మీరు చేసుకోండి. నార తీసే వృత్తి వేరు, తాట తీసే వృత్తి వేరు. వాళ్ళని వాళ్ళ పని చేసుకోనివ్వండి.' అని రఘురామ కృష్ణంరాజులు వ్యాఖ్యలు చేశారు. అయితే సోషల్ మీడియాలో రఘు రామ కృష్ణంరాజు వ్యాఖ్యల మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము మాత్రమే పరిపాలన చేయాలి అన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడాడంటూ, ఇది ఆయన అహంకారానికి నిదర్శనం అంటూ వివిధ వర్గాల వారు ఆయన వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. మొత్తానికి నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘు రామ కృష్ణంరాజును వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. మరి ఈ వివాదాలు ఆయన ఎన్నికల ఫలితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.