భారత్ అమ్ములపొదిలో గోల్డెన్ యారోస్ గా రాఫెల్

భారతవైమానిక దళంలో కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రికత్త చోటుచేసుకుంటున్న తరుణంలో వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేస్తూ రాఫెల్ యుద్ధవిమానాలను అధికారికంగా భారతవైమానికి దళంలో చేర్చారు.  

 

హర్యానాలోని అంబాల ఎయిర్‌బేస్‌లో రఫేల్‌ విమానం ఆవిష్కరణ జరిగింది. 17 స్క్వాడ్రన్ గోల్డెన్ యారోస్‌లో ఈ ఫైటర్ జెట్స్ చేరాయి. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనైన్‌, ఎయిర్ జనరల్ ఎరిక్ ఆటోలెట్, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్‌ భదూరియా, డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

2016 సెప్టెంబరులో ఇండియా, ఫ్రాన్స్ మధ్య 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్‌ ఏవియేషన్స్‌ ఐదు రాఫెల్ ఫైటర్ జెట్స్ ను మొదటి దశలో పంపించింది. ఈ ఐదు అత్యాధునిక యుద్ధ విమానాలు జూలై 27న అంబాలాకు చేరిన విషయం తెలిసిందే. అయితే వీటిని వైమానిక దళంలో అధికారికంగా చేర్చే ప్రక్రియ ఈ రోజు జరిగింది. సరిహద్దుల్లో డ్రాగన్  చైనా కవ్విస్తున్న సమయంలో భారత వైమానిక దళంలోకి రఫేల్ చేరడం కీలకంగా మారింది. అత్యంత శక్తివంతమైన వీటిని ఏ ఎయిర్ బేస్ కు తరలిస్తారు అన్నది మాత్రం రహస్యంగానే ఉంచారు.