కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ!!

 

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి మద్దతు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా పార్టీ నాయకులు ఆమెను అధ్యక్షురాలిగా ప్రతిపాదిస్తూ వస్తున్నారు. తాజాగా ఆ పార్టీ నేత, సీనియర్ బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హా కూడా.. పార్టీ అధ్యక్ష పదవిలో ప్రియాంక గాంధీ అయితే ఒదిగిపోతారని అభిప్రాయపడ్డారు.

గత వారంలో యూపీలో హత్య కావించబడ్డ గిరిజన రైతులను పరామర్శించేందుకు వెళ్లి, అరెస్టయిన ప్రియాంకా గాంధీని శతృఘ్నసిన్హా పొగడ్తల్లో ముంచెత్తారు. సోన్‌భద్ర బాధితులను పరామర్శించే విషయంలో ప్రియాంక చూపిన తెగువ ప్రశంసనీయమన్నారు. సమస్యలపై పోరాడే విషయంలో ఆమె దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో సమానంగా నిలిచారని అన్నారు. ప్రజల కోసం అరెస్టులను సైతం ఆనందంగా స్వాగతించారన్నారు. దీంతో పార్టీని ముందుకు నడపడానికి గల సామర్థ్యం ఆమెలో ఉందన్న విషయం తేటతెల్లమైందన్నారు. 

ఇటీవల కేంద్ర మాజీ మంత్రి నట్వర్‌ సింగ్‌ సైతం అధ్యక్షురాలిగా ప్రియాంకని సమర్థించిన విషయం తెలిసిందే. గాంధీ కుటుంబేతర సభ్యులు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టినట్లయితే పార్టీ 24 గంటల్లో చీలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. లాల్‌ బహదూర్ శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి సైతం ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేయడం గమనార్హం. పార్టీ అధ్యక్ష పదవికి ప్రియాంక గాంధీయే సరైన వ్యక్తి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతరులెవరు ఆ స్థానంలోకి వచ్చినా పార్టీ ముక్కలుముక్కలుగా చీలిపోతుందన్నారు.