క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి.. అయినా వీడని సస్పన్స్!!

ఊహించిందే జరిగింది. నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. గత మంగళవారం ముఖేశ్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ పిటిషన్ ను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపించింది. అంతేకాదు, నిర్భయ దోషులు అత్యంత దారుణానికి పాల్పడ్డారని, వీరికి క్షమాభిక్ష పెట్టవద్దని కూడా హోంశాఖ రాష్ట్రపతిని కోరింది. ఈ నేపథ్యంలో, పిటిషన్ ను పరిశీలించిన రాష్ట్రపతి ఎక్కువ సమయం తీసుకోకుండానే పిటిషన్ ను తిరస్కరించారు. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించడంతో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కావడం ఖాయమైంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 22న ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉదయం 7 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. అయితే, క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించాక 14 రోజుల గడవుతో దోషులను ఉరి తీయాలనే నిబంధనలున్నాయని న్యాయవాదులంటున్నారు. ఈ నేపథ్యంలో, 22న ఉరిశిక్ష అమలవుతుందా? లేక మరి కొన్ని రోజులు పడుతుందా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.