కాంగ్రెస్ వాసనలు వదల్లేనట్టుంది...



చిమడవే చిమడవే ఓ చింతకాయ నువ్వెంత చిమిడినా నీ పులుపు పోదు...  ఉడకవే ఉడకవే ఓ ఉల్లిపాయ... నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు... అనిచిన్నప్పుడెప్పుడో చదువుకున్న పద్యం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని చూస్తే ఇప్పుడు గుర్తొస్తోంది. ఉడికిన ఉల్లిపాయకు కంపు పోనట్టు భారత రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నప్పటికీ ప్రణబ్ ముఖర్జీ గారి నుంచి కాంగ్రెస్ పార్టీ వాసనలు వదిలినట్టు లేవు. అందుకే కాంగ్రెస్ పార్టీ హయాంలో, రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భోఫోర్స్ కుంభకోణాన్ని అసలు కుంభకోణమే కాదన్నట్టుగా ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు. దేశాధినేత హోదాలో వున్న ప్రణబ్ ముఖర్జీ ఇలా మాట్లాడ్డం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నో పదవులు, చివరికి రాష్ట్రపతి పదవిని కూడా పొందిన ప్రణబ్ ముఖర్జీ తన కృతజ్ఞతను బోఫోర్స్ అనేది అసలు కుంభకోణమే అన్నట్టు మాట్లాడుతున్నారు. మీడియానే దానిని కుంభకోణం అంది తప్ప ఏ కోర్టూ దానిని కుంభకోణం అంటూ వ్యాఖ్యానించలేదని చెప్పుకొచ్చారు. ప్రణబ్ ముఖర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసినట్టుగానే భావించాలి. అయితే రాష్ట్రపతి పదవిలో వున్న ఆయన పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి వుంటుంది. ఆచితూచి మాట్లాడాల్సి వుంటుంది. ప్రణబ్ ముఖర్జీ ఇప్పుడు చేసిన ఆ వ్యాఖ్యలు ఆ విలువల పరిధిని దాటాయనే భావించాల్సి వుంటుంది. రాష్ట్రపతి పదవికి వచ్చినప్పటికీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం తగ్గకపోతే పదవీ విరమణ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కీర్తిస్తూ కాలక్షేపం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.