ఎట్టిపరిస్థితిల్లో బీజేపీ అధికారంలోకి రాదు...

 

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గత కొద్దికాలంగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన బీజేపీ పై దుమ్మెత్తిపోశారు. ఈనెల 12 వ తేదీన కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికలు చాలా కీలకం కావడంతో...ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఎవరికి వారు బిజీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక జోరుగా సాగుతున్న రాజకీయ పార్టీల ప్రచారంపై ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు.

 

"కర్ణాటకలో భాజపా అధికారంలోకి రావడమనేది కల్ల. విభజించి పాలించే అధికారాన్ని ఎవరూ కోరుకోరు. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అందిరికీ చోటుంటుంది. స్వేచ్ఛ ఉంటుంది. ఏ మతానికో, కులానికో మన దేశం పరిమితం కాదు. దక్షిణ భారత దేశంలో భాజపా ఇక అధికారంలోకి రాదు. వారి సిద్ధాంతాలు ఇక్కడ పనికి రావు. మనదేశంలో ఉండే రాజకీయ పార్టీలన్నింటికీ సొంత నిర్ణయాలు, సిద్ధాంతాలు ఉంటాయి. కానీ ఒక్క భాజపా మాత్రం వేరొకరి సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటుంది" అని అన్నారు.

 

అంతేకాదు ఇటీవల బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పలువురి చేత తిట్టించుకుంటున్న నేపథ్యంలో దానిపై కూడా స్పందించిన ప్రకాశ్ రాజ్‘మోదీ వారి పార్టీ నాయకులకు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. మోదీజీ... వారిని మాట్లాడనివ్వండి. భాజపా నేతలు ఎలాంటి వారో తెలుసుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం ఇదే. వారి మనసులో ఏముందో తెలుస్తుంది. మోదీ భాజపా పార్టీ నేతల నోర్లు మూయించినా వారి వివాదాస్పద వ్యాఖ్యల పర్వం కొనసాగుతూనే ఉంది... భాజపా వర్గ రాజకీయాలు చేయడం లేదని నిరూపించమనండి... ఈ ఛాలెంజ్‌కు నేను సిద్ధంగా ఉన్నాను. రాజకీయ నేతలు చెప్పే మాటలను బట్టి వారిని నమ్మద్దు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే వారి మాట వినండి.’ అని అన్నారు. అని అన్నారు. ఇంకా ‘భాజపాకు కర్ణాటక అంతగా కలిసిరాలేదు... ఇంతకుముందు అక్కడ అధికారంలోకి వచ్చిన యడ్యూరప్ప ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు... దీంతోపాటు మరికొందరు కీలక నేతలదీ ఇదే పరిస్థితి...కర్ణాటక ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రాదని ’ అని అభిప్రాయపడ్డారు.