మాలేగావ్ పేలుళ్ల కేసు.. ప్రజ్ఞా ఠాకూర్ ప్రతివారం కోర్టుకి రావాల్సిందే

 

2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసు కీలక దశకు చేరింది. ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు.. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సహా నిందితులంతా వారానికోసారి కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. విచారణ జరుగుతున్న నేపథ్యంలో వారు కోర్టుకు రాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ కోసం ప్రతివారం కోర్టు ముందు హజరు కావాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణ మే 20న జరుగుతుంది.

2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్లలో బీజేపీ నేత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా అనేక మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బెయిల్ పై బయటికొచ్చారు. ఆమెకి ఈ ఎన్నికల్లో బీజేపీ భోపాల్ ఎంపీ టికెట్ ఇచ్చింది. తీవ్రవాద కార్యకలాపాల్లో నిందితురాలుగా ఉన్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కి బీజేపీ టికెట్ కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు ప్రజ్ఞా ఠాకూర్ ఎన్నికల ప్రచారంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆమె.. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే ని ఓ గొప్ప దేశ భక్తుడు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

29 డిసెంబర్ 2008న రంజాన్ సమయంలో మాలేగావ్ లోని అంజుమన్ చౌక్, భీఖూ చౌక్ దగ్గర వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో ఆరుగురు చనిపోయారు. 101 మంది గాయపడ్డారు. మహారాష్ట్ర ఏటీఎస్ ఈ కేసులో సాధ్వీ ప్రజ్ఞా, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా అనేక మందిని దోషులుగా భావించి అరెస్ట్ చేసింది.