విజయవాడ టికెట్ ఇస్తే పొట్లూరి తెదేపా గూటికి

 

కొన్ని రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు సినీ నిర్మాత పొట్లూరు వర ప్రసాద్ త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, విజయవాడ నుండి పోటీ చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, జగన్మోహన్ రెడ్డిని తట్టుకొని పార్టీలో ఎక్కువకాలం కొనసాగడం కష్టమని గ్రహించిన ఆయన వైకాపాలో చేరే ఆలోచనను విరమించుకొన్నారు. అయితే, ఇదంతా జగన్మోహన్ రెడ్డిని, వైకాపాని అప్రదిష్టపాలు చేసేందుకు చంద్రబాబు, ఆయనకి అనుకూలంగా ఉండే మీడియా చేసిన కుట్రే తప్ప తామేనాడు పొట్లూరిని పార్టీలోకి ఆహ్వానించలేదని, టికెట్ కూడా ఆఫర్ చేయలేదని వైకాపా వాదించింది.

 

తాజా సమాచారం ఏమిటంటే పొట్లూరి తెదేపాలో చేరే ప్రయత్నంలో కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రముఖ తెదేపా నాయకుడుని వెంటబెట్టుకొని మొన్న చంద్రబాబుని కలిసి విజయవాడ లోక్ సభ టికెట్ కోసం అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. కానీ, ఆ సీటు ఇప్పటికే కేశినేని నానికి కేటాయించినందున దానిని ఆయనకు ఇవ్వడం సాధ్యం కాదని, వేరెక్కడి నుండయినా పోటీ చేసేందుకు సిద్దపడితే ఆలోచిస్తామని చంద్రబాబు జవాబు చెప్పినట్లు తెలుస్తోంది. గతేడాది చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు విజయవాడ సీటుని ఆశిస్తున్న వల్లభనేని వంశీని తప్పించి, కేశినేని నానికి అప్పగించారు. దానితో వంశీ చాలా ఆగ్రహించినపుడు, ఆయనకు గన్నవరం శాసనసభ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని సమాచారం. అందువల్ల ఇప్పుడు పొట్లూరి విజయవాడ టికెట్ ఆశించినా ఇవ్వలేని పరిస్థితి.

 

పొట్లూరి కృష్ణాజిల్లాలో కొందరు తెదేపా శాసనసభ్యులను కలిసి వారి మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నం చేసారు. కానీ వారెవరూ కూడా పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేఖంగా వెళ్లేందుకు సిద్దపడకపోవడంతో పొట్లూరి చివరి ప్రయత్నంగా నేరుగా చంద్రబాబునే కలిసి మాట్లాడారు, కానీ ఫలితం లేకపోయింది. ఈసారి ఎన్నికలలో పోటీ చాలా తీవ్రంగా ఉండబోతునందున, చంద్రబాబు అభ్యర్దుల ఎంపికలో చాలా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. మరో పక్క నారా లోకేష్ కూడా వేరేగా ఎప్పటికప్పుడు నియోజక వర్గాల వారిగా సర్వేలు నిర్వహింపజేయిస్తూ గెలుపు గుర్రాల పేర్లను తండ్రికి సూచిస్తునట్లు సమాచారం.

 

ఒకవేళ పొట్లూరి విజయవాడ కోసం పట్టుబట్టకుండా వేరే చోట నుండి పోటీకి అంగీకరించినప్పటికీ, తెదేపా టికెట్స్ కోసం చాలా ఒత్తిడి ఉన్నకారణంగా ఆయనకు ఎక్కడి నుండి టికెట్ కేటాయించాలన్నాచాలా కష్టమే అవుతుంది. అయినప్పటికీ, ఒకవేళ పొట్లూరి అందుకు అంగీకరిస్తే చంద్రబాబు ఏదోవిధంగా సర్దుబాటు చేయవచ్చునేమో! ఒకవేళ పొట్లూరి విజయవాడ టిక్కెటే కావాలనుకొంటే, ఆయన తరువాత గమ్యం కాంగ్రెస్ పార్టీ కావచ్చును. ఎందుకంటే విజయవాడ కాంగ్రెస్ యంపీ లగడపాటి రాజగోపాల్ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసి కిరణ్ కుమార్ రెడ్డి లేదా తనే స్వయంగా స్థాపించబోయే కొత్త పార్టీ టికెట్ మీద పోటీ చేయబోతున్నారు గనుక, పోట్లూరికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ దొరికే అవకాశం ఉంది. కానీ, సీమాంధ్రలో తీవ్ర ప్రతికూలత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయడమంటే అది మరొక వర్ణ చిత్రమే అవుతుంది ఆయనకు. గనుక తన కల నెరవేర్చుకోవడానికి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయవలసి ఉంటుంది. కానీ, అది కూడా చాలా భారీ ఖర్చు, రిస్కుతో కూడిన వ్యవహారమే గనుక, పొట్లూరి ఏమి చేయబోతున్నారో తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.