గేమ్ తక్కువ... గోల ఎక్కువ!

ఆటలంటే ఆటలు కాదు! అవును... అంతర్జాతీయ స్థాయిలో ఆటలంటే ఆటలు కాదు. అందులో బోలెడంత శ్రమ, పట్టుదల, తపన వుంటాయి. కాని, వీటన్నిటితో పాటే కావాల్సినంత రాజకీయం వుంటుంది! ఇది ఏ క్రీడకూ అతీతం కాదు. దాదాపు అన్ని క్రీడల్లో బోలెడు పాలిటిక్స్ ప్లే చేస్తుంటాయి. సెలక్షన్స్ మొదలు సక్సెస్ వరకూ అంతటా రాజకీయమే సత్తా చాటుతుంటుంది. చాలా సార్లు ప్రతిభ కూడా రాజకీయానికి దాసోహం అనాల్సి వస్తుంది. ఒలంపిక్స్ లో అందరూ సింధు సిల్వర్ మెడల్ గురించే మురిసిపోయారు. ఆమెకే కోట్ల రూపాయలు గుమ్మరించి ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి. కాని, మరో వైపు మరో అద్బుతమైన క్రీడ రాజకీయాల క్రీనీడలో మగ్గిపోతోంది! అదే టెన్నిస్!

 


టెన్నిస్ అనగానే మనకు సహజంగానే సానియా గుర్తుకు వస్తుంది. ఆమె రీసెంట్ గా పేస్ ను ఉద్దేశించి ట్వీట్స్ చేసింది. విషపూరితమైన వ్యక్తితో ఆడటం కంటే ఆడకపోవటమే గెలుపని చెప్పుకొచ్చింది! దీనికి కారణం లియాండర్ పేస్ తాజాగా ముగిసిన డేవిస్ కప్ తరువాత చేసిన వ్యాఖ్యలే! ఆ టోర్నమెంట్లో బోపన్నతో కలిసి పేస్ పోటికి దిగాడు. ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడక దారుణంగా ఓడిపోయి ఇంటికి తిరిగొచ్చారు. పైగా ఓటమి తరువాత పేస్ రియో ఒలంపిక్స్ లో ఇండియా అట్టర్ ఫ్లాప్ కి కారణం తప్పుడు సెలక్షన్స్ అంటూ కామెంట్ చేశాడు. అందుకే, సానియా, బోపన్న ట్విట్టర్ లో పేస్ పై రగిలిపోయారు!
రియో ఒలంపిక్స్ కి సానియా, బోపన్న జోడిగా వెళ్లారు. అక్కడ సెమీస్ దాకా వెళ్లి రిటర్న్ వచ్చారు. వాళ్లకి బదులు వేరే జోడీని పంపి వుంటే మెడల్ వచ్చేదన్నట్టు పేస్ కామెంట్ చేశాడు.

 


లియాండర్ పేస్ కి సానియా, బోపన్న వంటి వారికి పడకపోవటం ఇప్పటి రాజకీయం కాదు. ఎప్పట్నుంచో వీళ్లకి ఒకరంటే ఒకరికి పడదు. అటు భూపతి, పేస్ కూడా చాలా సార్లు గొడవలు పడ్డారు. అసలు సానియా, భూపతి, పేస్, బోపన్న లాంటి స్టార్ టెన్నిస్ ప్లేయర్స్ కి ఒకరంటే ఒకరికి ఎందుకు పడదు? ఈ ప్రశ్నకి సమాధానంగా బోలెడంత లోతుగా చర్చించుకోవాలి. కాని, అంతకంటే ముఖ్యం వీళ్ల ఈగోస్ కారణంగా దేశం ఒలంపిక్  మెడల్స్ సహా ఎన్నో అమూల్యమైన విజయాలు మిస్ అవుతోంది. ఈ స్టార్ టెన్నిస్ ప్లేయర్స్ తమ ఆట కేవలం తమ స్వంతం అనుకుంటున్నారు. తమ విజయంతో దేశ ప్రతిష్ఠ ముడిపడి వుందని గుర్తించటం లేదు. ఎప్పుడైనా టెన్నిస్ అసోసియేషన్ బలవంతంగా వీళ్లని డబుల్స్ ఆడిస్తే నిర్మొహమాటంగా ఓడిపోయి ఇంటికొస్తున్నారు. తమ కోపాలు, తాపాల కోసం దేశ కీర్తిని తాకట్టు పెడుతున్నారు! ఇది పరమ దుర్మార్గం...

 


లండన్ ఒలంపిక్స్ లో, రియో ఒలంపిక్స్ లో, తాజాగా జరిగిన డేవిస్ కప్ లో... ఇలా చెబుతూ పోతే గత కొన్ని ఏళ్లుగా ఎన్నోసార్లు మనం మిస్సైన టెన్నిస్ టోర్నమెంట్లు బోలెడు. అందుకు కారణం ప్రతిభ లేకపోవటం, ప్రోత్సాహం కరువవటం కాదు. అలాంటి పరిస్థితుల్లో మగ్గిపోతున్న హాకీ, కబడ్డీ లాంటి క్రీడలు దేశంలో చాలా వున్నాయి. కాని, టెన్నిస్ కి కావాల్సినంత డబ్బు, ప్రోత్సాహం అన్నీ వున్నా ప్లేయర్ల అమానుష ప్రవర్తన వల్ల విజయాలు దక్కకుండా పోతున్నాయి. 
సానియా, బోపన్న, పేస్, భూపతి... ఇలాంటి వాళ్లలో ఎవరు కరెక్ట్ అన్నది పక్కన పెట్టి అర్జెంట్ గా టెన్నిస్ సమాఖ్య విజయాలు అందించగలిగే కొత్త ప్లేయర్లు, వాళ్ల మధ్య చక్కటి స్నేహపూరిత బంధం ఏర్పడేలా చూడాలి. అప్పుడు ఇలా ముగ్గురు నలుగురు పెట్టుకునే గిల్లికజ్జాల వల్ల దేశం పరువు పోకుండా వుంటుంది.

 

ఎందుకంటే, మన స్టార్ టెన్నిస్ ప్లేయర్లు ఇతర దేశాల ప్లేయర్లతో డబుల్స్ లో బాగానే ఆడుతున్నారు. మన దేశం వారితో జోడికట్టమంటేనే గొడవలు వస్తున్నాయి. అందుకే, 125కోట్ల మంది జనాభ వున్న దేశంగా మనం మరింత మంది క్రీడాకారుల్ని సృష్టించుకోవాల్సిన అవసరం వుంది. అంతే కాదు వాళ్లలో దేశభక్తి వుండేలా కూడా చూసుకోవాలి! ఆఫ్ట్రాల్... స్పోర్ట్స్ ఛాంపియన్స్ అంటే స్పాన్సర్స్ , కార్పోరేట్స్, బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ... ఇంతే కాదు కదా! దేశం పేరు నిలపటమే అసలైన క్రీడ! ఆ గేమ్ మన టెన్నిస్ ప్లేయర్లు ఏ మాత్రం ఆడుతున్నట్టు కనిపించటం లేదు..