వైఎస్ వివేకా మృతిపై విచారణకు సిట్‌ ఏర్పాటు

 

వైఎస్‌ వివేకానంద రెడ్డి ఈరోజు తెల్లవారుజామున మృతిచెందిన విషయం తెలిసిందే. మొదట ఆయన గుండెపోటుతో మరణించారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన తలకి, చేతులకు బలమైన గాయాలు ఉండటం.. మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండడంతో.. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వివేకా మృతిపై విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. అడిషనల్‌ ఎస్పీ బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ సిట్ ఏర్పాటైంది. అనుమానాస్పద మృతి వార్తలపై తక్షణమే స్పందించిన సీఎం చంద్రబాబు.. అప్పటికప్పుడు పోలీస్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు, కడప పోలీసులతో మాట్లాడారు. వివేకా మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని, దోషులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని అన్నారు.