మోడీ అపురూప కానుక
posted on Nov 18, 2014 1:32PM

ఆస్ట్రేలియా పర్యటనలో వున్న భారత ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశ ప్రధాని టోనీ అబాట్‌కి ఓ అరుదైన బహుమతి ఇచ్చారు. కాన్‌బెర్రాలో టోనీ అబాట్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడానికి ముందు మోడీ ఈ బహుమతి ఇచ్చారు. భారత్‌లో స్థిరపడిన ఆస్ట్రేలియా జాతీయుడైన న్యాయవాది జాన్ లాంగ్ 1854లో ఝాన్సీ లక్ష్మీబాయి తరఫున ఈస్ట్ ఇండియా కంపెనీపై కోర్టులో వేసిన పిటిషన్ కాపీని మోడీ కానుకగా ఇచ్చారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్ చేశారు. భారతదేశంలో జాన్ అబాట్ జీవితాన్ని ప్రతిబింబించే మరో బహుమతిని కూడా మోడీ అబాట్‌కి అందించినట్టు అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన జాన్ లాంగ్ 1842లో భారతదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడారు. కంపెనీకి వ్యతిరేకంగా పత్రిక కూడా నడిపిన ఆయన ఆ తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయికి సలహాదారుగా పనిచేశారు. ఆమెకి సంబంధించిన న్యాయ వ్యవహారాలను పర్యవేక్షించారు.