మా ఆయన పాస్‌పోర్టు వివరాలివ్వండి- మోదీ భార్య!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ భార్య యశోదాబెన్‌, తన భర్తకు సంబంధించిన పాస్‌పోర్టు వివరాలను తెలుపవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆమె సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తుని దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే- గత ఏడాది నవంబరులో యశోదాబెన్ తనకి పాస్‌పోర్టు కావాలంటూ పెట్టుకున్న అర్జీని అధికారులు తిరస్కరించారు. ఆమె తన పాస్‌పోర్టుతో పాటు వివాహానికి సంబంధించిన సర్టిపికెట్లను పొందుపరచలేదనీ, అందుకే ఆమె పాస్‌పోర్టుని తిరస్కరిస్తున్నామనీ అధికారులు చెప్పారు. దాంతో ఒళ్లుమండిన యశోదాబెన్‌, వివాహానికి సంబంధించి ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా తన భర్త ఎలా పాస్‌పోర్టుని పొంది ఉంటారో తెలుసుకోవాలనుకున్నారు. అందుకని ప్రస్తుతం సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. మోదీ కనుక తన వ్యక్తిగత వివరాలను దాచిపెట్టి పాస్‌పోర్టును పొందినట్లు వెల్లడైతే, ప్రతిపక్షాలకు ఒక వివాదం దొరికినట్లే! యశోదాబెన్ సమాచారహక్కు చట్టాన్ని ఆశ్రయించడం ఇది మొదటిసారేం కాదు. 2014లో తన రక్షణ కోసం ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారో చెప్పమంటూ ఆమె ఒక దరఖాస్తుని దాఖలు చేశారు. తనకి రక్షణగా ఉన్న వ్యక్తుల గురించి తనకు పూర్తి సమాచారం ఉండాలనీ, లేకపోతే మాజీ ప్రధాని ఇందిరాగాంధీలాగా స్వంత అంగరక్షకుల నుంచే తాను ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందనీ... ఆమె అప్పట్లో ఆందోళనను వ్యక్తం చేశారు.