మీడియాకు క్లాస్ పీకిన మోడీ...
posted on Nov 6, 2017 4:16PM

ప్రధాని నరేంద్ర మోడీ మీడియాకు క్లాస్ తీసుకున్నారు. మోడీ ఏంటి... మీడియాకు క్లాస్ తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... మోడీ చెన్నైలో జరిగిన ‘డైలీ తంతి’ పత్రిక 75వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.... ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మాదిరిగానే మీడియా కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని...‘ఎప్పుడూ రాజకీయాలేనా.. భారత్ అంటే రాజకీయ నాయకులే కాదు.. ఇంకా చాలా ఉంది.. ఈ దేశంలో 125 కోట్ల మంది ప్రజలున్నారు.. మీడియా మిగతా అంశాలపై కూడా దృష్టి సారించాలి’ అన్నారు. శాంతి ద్వారా తప్ప బల ప్రయోగం ద్వారా సంస్కరణలను తీసుకురాలేమని, ఇందులో మీడియాదే ప్రధాన పాత్ర అని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ ‘వాక్ స్వాతంత్య్రం’పై కూడా స్పందించారు. ‘ప్రజా ప్రయోజనాల కోసమే మీడియా తన వాక్ స్వాతంత్య్రాన్ని ఉపయోగించాలి. రాసే స్వాతంత్య్రం ఉంది కానీ.. తప్పుడు వార్తలు రాసే స్వాతంత్య్రం మాత్రం లేదు. పత్రికలను ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పేర్కొంటారు. మీడియా కచ్చితంగా ఓ శక్తే. దాన్ని దుర్వినియోగం చేయకూడదు’ అని ఆయన అన్నారు. మొత్తానికి మోడీ క్లాస్ పీకుతూనే బాధ్యతను గుర్తుచేశారు