అమరావతి... ఏపీ రాజధాని కాదని ఎవరన్నారు? దేశానికి మాత్రం హైదరాబాదే సెకండ్ కేపిటల్..!
posted on Mar 4, 2020 10:30AM

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రెండున్నర నెలలుగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు, మహిళలు, ప్రజలు... తిండీతిప్పలు మానేసి... దాదాపు 80రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, నిరసనలు చేస్తున్నారు. రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదంటూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏపీ హైకోర్టు నుంచి ఇంటర్నేషనల్ కోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోవైపు, గవర్నర్, రాష్ట్రపతిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశామని, కానీ, ఇప్పుడు జగన్ ప్రభుత్వం... అమరావతి నుంచి కేపిటల్ ను తరలిస్తోందని పదేపదే ఫిర్యాదు చేశారు.
అమరావతి కోసం 29 గ్రామాల రైతులు, మహిళలు, యువత, పిల్లలు... ఇలా అందరూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే, మంత్రులు మాత్రం చాలా తేలిగ్గా ప్రకటనలు చేస్తున్నారు. మంత్రి బొత్స ప్రకటనలతో మొదలైన గందరగోళాన్ని, మిగతా మంత్రులు కొనసాగిస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు, అమరావతి... ఏపీకి రాజధాని కాదని ఎవరు చెప్పారంటూ ఎదురు ప్రశ్నించారు. తామెప్పుడూ అమరావతి... ఏపీ రాజధాని కాదని చెప్పలేదన్నారు. అయితే, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న మంచి ఉద్దేశంతోనే విశాఖను పరిపాలన రాజధానిగా చేశామని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా హైదరాబాద్ పైనా పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ చెప్పినట్లుగా ఏదో ఒక రోజు కచ్చితంగా హైదరాబాద్... దేశానికి రెండో రాజధాని అవుతుందని అన్నారు.