ప్రజల్లోకి వెళ్లాలంటేనే భయమేస్తోంది... హైకమాండ్ కు వైసీపీ ఎమ్మెల్యేల మొర..!

 

2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఓటమి తర్వాత వైజాగ్ పై ప్రత్యేక దృష్టిపెట్టి పార్టీని బలోపేతం చేయడమే కాకుండా, మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఘనవిజయం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఎంపీ విజయసాయిరెడ్డికి విశాఖ ఎమ్మెల్యేలు ఊహించని షాకిచ్చారట. ఇటీవల, విశాఖ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన విజయసాయికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కంగుతినే వార్త చెప్పారట. తమకు ప్రజల్లోకి వెళ్లాలంటేనే భయమేస్తోందంటూ గోడు వెళ్లబోసుకున్నారట. ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు మంత్రులు మోపిదేవి, అవంతి ముందు తమ పరిస్థితిని చెప్పుకుని మొరపెట్టుకున్నారట. ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత వచ్చిందని, సమస్యలపై నిలదీస్తున్నారని, వెంటనే పరిష్కరించాలని పట్టుబడుతున్నారని, దాంతో తమకు ప్రజల్లోకి వెళ్లాలంటేనే భయమేస్తోందంటూ గోడు వెళ్లబోసుకున్నారట. ఎంపీలు సత్యవతి, బి.మాధవి, ఎంవీవీ సత్యనారాయణ... అలాగే ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు... ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌, అదీప్‌ రాజ్‌, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, శెట్టి ఫల్గుణ తదితరులు.... సమస్యలపై ఏకరువు పెట్టారట. విశాఖ నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు... ముందు సమస్యలు పరిష్కరించండి.... ఆ తర్వాతే ప్రజల్లోకి వెళ్తామని, అప్పటివరకు జనంలోకి వెళ్లలేమని తేల్చిచెప్పారట. ముఖ్యంగా ఇసుక కొరత కారణంగా జిల్లాలో వేలాది మంది ఉపాధి కోల్పోయారని విజయసాయి దృష్టికి తీసుకెళ్లిన విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులు పరిస్థితిని చక్కదిద్దాలని కోరినట్లు తెలుస్తోంది.

అయితే, ఇది ఒక్క విశాఖ జిల్లాకే పరిమితం కాలేదని, రాష్ట్రమంతటా ఇదే భావన ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి విశాఖ ఎంపీలు, ఎమ్మెల్యేలు బయటపడ్డారని, త్వరలోనే మిగతా జిల్లాల ప్రజాప్రతినిధులూ ఓపెన్ అప్ అవుతారని అనుకుంటున్నారు. మొత్తానికి విశాఖ ఎంపీలు, ఎమ్మెల్యేలు... తమకు ప్రజల్లోకి వెళ్లాలంటేనే భయంగా ఉందంటూ విజయసాయిరెడ్డికి మొర పెట్టుకోవడం సంచలనంగా మారిందంటున్నారు పార్టీ వర్గాలు.