ప్రజలు‘ముందస్తు’గానే నిర్ణయించేశారా?

వైసీపీ అధినేత‌, ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, గ‌త కొంత కాలంగా 175 సీట్ల జపం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 151 సీట్లు సాధించాం..ఈ సారి 175 సాధించ‌టం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు అని పార్టీ స‌మావేశాల్లో త‌ర‌చూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో అయన స్వరంలో మార్పు కనిపిస్తోంది.  వై నాట్ 175, వై నాట్ కుప్పం .. అంటూ బీరాలు పోయిన జగన్ రెడ్డి ఇప్పుడు  అంత  ధీమాగా లేరు.

నిజానికి నిజం ఏమిటో ఆయనకు తెలుసు  తెలుగుదేశం యువ తేజం నారా లోకేష్  సాగిస్తున్న యువగళం పాదయాత్రకు  రాయలసీమలో లభించిన ప్రజాదరణ వైసీపీ వెన్నులో వణుకు పుట్టించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత గడ్డ కడప జిల్లాలో యుగళం పాదయాత్రలో  గళమెత్తి గర్జించిన ప్రజాగళం వైసీపీలో ప్రకంపనలు సృస్తిస్తోంది. అవును  స్థానిక వైసీపీ నాయకుల్లోనే కాదు  ఏకంగా జగన్ రెడ్డి గుండెల్లోనే  యువగళం గుబులు పుట్టిస్తోంది. నిజానికి  క్షేత్ర స్థాయి పరిస్థతి ఏమిటో  జగన్ రెడ్డికి తెలుసు  అయినా పార్టీ క్యాడ‌ర్ లో ఉత్సాహం  నింపేందుకో..నేత‌ల్లో స్పీడ్ పెంచేందుకో కుప్పంలోనూ గెలుస్తామని గొప్పలు పోతున్నారు.

అయితే క్షేత్ర‌స్థాయిలో మాత్రం అందుకు భిన్న‌మైన పరిస్థితులు ఉన్నాయ‌నే విష‌యం ఆ పార్టీ నేత‌లు కూడా అంగీక‌రిస్తున్నారు.   తాజాగా, తెలుగుదేశం పార్టీ అధినేత మూడు రోజుల కుప్పం పర్యటనలో ప్రజలు ఆయనకు మరో మరు బ్రహ్మరధం పట్టారు. కాంగ్రెస్, వైసేపీ నాయకులు,  క్యాడర్ క్యూకట్టి మరీ టీడీలో చేరారు.  మూడు రోజుల  పర్యటనలో భాగంగా రెండో రోజు చంద్రబాబు సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన కీలక నేత, కాంగ్రెస్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సురేష్ తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. అలాగే వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ నుంచి వందలాది మంది కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు.

మరోవంక  నాలుగు పదులకు పైగా రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ రాజకీయాలను అవపోసన పట్టిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. ‘రాబోయే ఎన్నికల్లో కుప్పంలో గెలుస్తామని జగన్‌ చెబుతున్నాడు. కుప్పంలో గెలవడం తర్వాత సంగతి ముందు పులివెందులను కాపాడుకో  అని సీఎం జగన్మోహన్‌రెడ్డికి చంద్రబాబు సూచించారు. పులివెందులలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. జగన్‌ ప్రజల బిడ్డ కాదని.. సమాజానికి కేన్సర్‌ గడ్డని చంద్రబాబు ఎప్పుడో  తేల్చి చెప్పారు. 

నిజం. చంద్రబాబు నాయుడు చెప్పింది  అక్షర సత్యం. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తే, జగన్ రెడ్డి నమ్ముకున్న తాయిలాలు  తిరగబడుతున్నాయి. ఇంత కాలం కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రత్యక్ష, పరోక్ష సహకారంతో నెట్టుకొచ్చిన జగన్ రెడ్డి కి ఇక పై కేంద్ర సహకరం మునుపటిలా ఉండదనే విషయం స్పష్టమైంది. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ వెనక కేంద్ర హోం మంత్రి అమిత్ షా  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అరాచక, అవినీతి పాలనను ఎండగడుతూ చేసిన వ్యాఖ్యలు విమర్శలు,ముందున్నది క్రొకోడైల్ ఫెస్టివల్ అనే విషయాన్ని స్పష్టం చేశాయి. అంతే కాదు  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా ఇక పై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సహకరం   ఉండక పోవచ్చని తమ గుండెల్లోని భయాన్ని బయట పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో మరో గత్యంతరం లేక జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహగానాలు  వినిపిస్తున్నాయి. 

అయితే ముందస్తుకు వెళితే  ముందుగా అధికారాన్ని కోల్పోవడం తప్ప ప్రయోజనం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, ఒకసారి చేసిన ఒక్క ఛాన్స్  తప్పు రెండోసారి చేసిది లేదని ఎక్కడికక్కడ ప్రజలు, ఎవరికి వారు తీర్మానం చేసుకుంటున్నారని అంటున్నారు. అందుకే  ముందస్తుకు వెళ్లి ముందుగా  చేతులు కాల్చుకోవడం కంటే  గడవు వరకు బండి లాగించడమే మేలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అలాగే  కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లుగా, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులే కాదు  శాంతి భద్రతల పరిస్థితి కూడా అధ్వాన స్థితికి చేరింది. విశాఖలో ఎంపి కుటుంబ సభ్యులను కిడ్నాప్, ఇందుకు తాజా ఉదాహరణ.  సామాన్య ప్రజల సంగతి పక్కన పెట్టినా రాష్ట్రంలో ఎంపీ కుటుంబానికి రక్షణ లేని పరిస్థితిని చూస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళతారా లేదా అనే విషయం ఎలా ఉన్నా అరాచక, అవినీతి పాలనకు పర్యాయపదంగా మారిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనకు ఉద్వాసన పలకాలనే ముందస్తు నిర్ణయం అయితే ప్రజలు తీసుకున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News