ఆప‌రేష‌న్ బీజేపీ.. కారు కంటే క‌మ‌ల‌మే రేవంత్‌ మెయిన్‌ టార్గెట్‌?

రాహుల్‌ను ప్ర‌ధాని చేయ‌డ‌మే కాంగ్రెస్‌పార్టీ ప్ర‌ధాన ల‌క్ష్యం. ఆ ల‌క్ష్య సాధ‌న‌ను సుల‌భ‌త‌రం చేయ‌డ‌మే రాష్ట్ర సార‌ధులు చేయాల్సిన‌ ప‌ని. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి బీజేపీ. క‌మ‌ల‌ద‌ళాన్ని ఎంత‌లా దెబ్బ‌కొడితే.. ల‌క్ష్యాన్ని చేర‌డం అంత ఈజీ. అందుకే, పువ్వు పార్టీని న‌లిపేయ‌డమే మెయిన్ టార్గెట్. బీజేపీ అధికారంలోలేని తెలంగాణ‌లాంటి రాష్ట్రాల్లో ప‌వ‌ర్‌లో ఉన్న‌ ప్రాంతీయ పార్టీల‌పై పోరాడుతూనే.. కాషాయ పార్టీని ఖ‌తం చేయ‌డ‌మే ప‌నిగా కాంగ్రెస్ నాయ‌కులు ప‌ని చేయాల్సి ఉంటుంది. ఆ మేర‌కు అధిష్టానం నుంచి వారికి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఉంటాయి. తెలంగాణ‌లోనూ ప్ర‌స్తుతం అదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై దండ‌యాత్ర చేస్తూనే.. ప‌నిలో ప‌నిగా బీజేపీని బొంద‌పెట్టే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని అంటున్నారు. టీఆర్ఎస్‌ను ఎలాగైనా ఎదుర్కోవ‌చ్చు.. క‌మ‌లద‌ళాన్ని నిర్వీర్యం చేసి.. ఎద‌గ‌కుండా చేయ‌డాన్ని మాత్రం అస్స‌లు వ‌దిలిపెట్టొద్దని ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్టున్నారు. అందుకే కాబోలు.. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక‌.. పైకి కేసీఆర్‌పైనే ఫైటింగ్‌లా క‌నిపిస్తున్నా.. డ్యామేజీ మాత్రం బీజేపీకే జ‌రుగుతోంది. వ‌రుస‌గా క‌మ‌ల‌నాథులు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కాషాయ బండి జోరుకు ఎక్క‌డిక‌క్క‌డ బ్రేకులు ప‌డుతున్నాయి. బీజేపీలో మునుప‌టి ఉత్సాహం క‌నిపించ‌డం లేదు. ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్‌ మిన‌మా పువ్వు పార్టీకి అన్నీ ఎదురుదెబ్బ‌లే.

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాక మొద‌టిసారిగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపుపై నిర‌స‌న‌కు పిలుపిచ్చారు. ఆ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి ఆయ‌న ఎంచుకున్న స్పాట్‌..నిర్మ‌ల్‌. అదేంటి ఏ హైద‌రాబాదో, క‌రీంన‌గ‌రో, హుజురాబాదో అయితే రాజ‌కీయంగా మ‌రింత మైలేజ్ వ‌చ్చేదిగా? మ‌రి, ఏరికోరి నిర్మ‌ల్‌లోనే రేవంత్‌రెడ్డి నిర‌స‌న‌కు ఎందుకు దిగార‌నే డౌట్ రాక‌మాన‌దు. 

అంతెందుకు, తాజాగా ద‌ళిత దండోరా పేరుతో ల‌క్ష‌మందితో రేవంత్‌రెడ్డి మ‌రో ఉద్య‌మానికి సిద్ధ‌మ‌య్యారు. ఆగ‌స్టు 9న ముహూర్తం. అది కూడా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర‌వెల్లి నుంచే శ్రీకారం. ఆదిలాబాద్‌లో ఎస్టీల సంఖ్య ఎక్కువ‌. అయినా కూడా ద‌ళిత దండోరాను ఇంద్ర‌వెల్లి నుంచే ప్రారంభించ‌డమూ వ్యూహాత్మ‌క‌మ‌నే అంటున్నారు. రేవంత్‌రెడ్డి ప‌దే ప‌దే ఉమ్మ‌డి ఆదిలాబాద్‌లో యాక్టివిటీస్ చేస్తుండ‌టం బీజేపీని దెబ్బ‌కొట్టేందుకేన‌ని చెబుతున్నారు. 

ఉమ్మ‌డి ఆదిలాబాద్ వ్యాప్తంగా బీజేపీకి మంచి ప‌ట్టుంది. అక్క‌డ‌ ఓ ఎంపీ కూడా ఉన్నారు. ఆ జిల్లాల్లో రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌లు బీజేపీ బ‌ల‌ప‌డేందుకు అనుకూలంగా మారాయి. తెలంగాణ మొత్తంలోకి ఉమ్మ‌డి ఆదిలాబాద్‌లోనే బీజేపీ ఎక్కువ బ‌లంగా క‌న‌బ‌డుతోంది. అందుకే, బీజేపీ జోరును త‌గ్గించేందుకే ఉమ్మ‌డి ఆదిలాబాద్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫోక‌స్ చేస్తున్నార‌ని అంటున్నారు. అక్క‌డ జ‌రిగే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు రేవంత్‌రెడ్డే స్వ‌యంగా హాజ‌ర‌వుతూ.. ప్ర‌జ‌ల‌ను బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 

కేసీఆర్ వ‌ర్సెస్ రేవంత్‌రెడ్డి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇలా ఫేస్ టు ఫేస్ ఫైట్ జ‌ర‌గాల‌నేది రేవంత్ గేమ్ ప్లాన్‌. అలాగైతేనే ఓట‌ర్లు ఇద్ద‌రిలో ఒక‌రి వైపు మ‌ళ్లుతారు. లేదంటే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త చీలిపోయి అది కాంగ్రెస్‌కే న‌ష్టం చేకూర్చుతుంది. అందుకే, అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే నాటిక‌ల్లా.. బీజేపీని సాధ్య‌మైనంత మేర దెబ్బ‌తీయాల‌నేది రేవంత్ ఎత్తుగ‌డ‌. ఆయ‌న పీసీసీ చీఫ్ అయ్యాక‌.. బీజేపీ నుంచే కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు పెరిగాయి. ఏకంగా బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ సోద‌రుడు సంజ‌య్‌నే హ‌స్తం గూటికి చేరుకున్నారు. పాల‌మూరు జిల్లా బీజేపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖ‌ర్ సైతం బీజేపీకి బై బై చెప్పేసి రేవంత్‌రెడ్డితో చేయి క‌లిపారు. కాషాయ కండువా క‌ప్పుకోవాల్సిన‌ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి కాంగ్రెస్ వైపు మ‌ర‌లిపోయారు. త్వ‌ర‌లోనే కూనా శ్రీశైలంగౌడ్ సైతం బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌ని అంటున్నారు. ఇలా, బీజేపీని వీలైనంత మేర‌కు బ‌ల‌హీన ప‌ర‌చ‌డ‌మే రేవంత్‌రెడ్డి టార్గెట్‌లా క‌నిపిస్తోంది. డ‌బుల్ బ్యారెల్ గ‌న్ లాంటి రేవంత్‌రెడ్డి.. ఇటు టీఆర్ఎస్‌, అటు బీజేపీని ఎయిమ్ చేస్తూ.. టూ బ‌ర్డ్స్ ఎట్ వ‌న్ షాట్  స్ట్రాట‌జీని అమ‌లు చేస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News