మెగా సోదరుల మాటల యుద్ధం

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేస్తానని శపథం చేసారు. అయితే ఆయన సోదరుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత భుజాన్నేసుకొన్నసంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల తమ్ముడు విసిరిన సవాల్ కి జవాబీయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

 

చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, “తమ్ముడు పవన్ సమాజానికి సేవ చేయాలనే తలపుతో రాజకీయాలలోకి ప్రవేశించాడు. 125సం.ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఎన్నో సవాళ్ళను సమర్ధంగా ఎదుర్కొని బయటపడింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి సవాళ్ళను ఎదుర్కోవడం కొత్తా కాదు, పెద్ద కష్టమూ కాదని” బదులిచ్చారు.

 

చిరంజీవికి కూడా కాంగ్రెస్ నీళ్ళు బాగానే ఒంటబట్టాయి గనుక అచ్చమయిన కాంగ్రెస్ వాదిలాగే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ చక్కగా చిలకపలుకులు పలికారు. అయితే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా అభ్యర్ధులు దొరకని పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఎవరికయినా అర్ధమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వంటి మంచి ప్రజాభిమానం ఉన్న వ్యక్తి, రాజకీయాలోకి ప్రవేశించడం, కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేయమని ప్రజలకు పిలుపునీయడం, ప్రజలపై, ముఖ్యంగా మెగాభిమానులపై ఎటువంటి ప్రభావమూ చూపదని చిరంజీవి అనుకొంటే అది భ్రమే అవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలకి ప్రస్తుతం ఇంతకంటే వేరే గత్యంతరం కూడా లేదు పాపం!