అభిమానులు కాదు... అభిమన్యులు!

 

సినిమా.... రెండున్నర గంటల సేపు నడిచే వేలాది రంగుల మాయ! అందుకే, లక్షలాది మంది, కోట్లాది మంది సినీమాయకు బానిసలైపోతుంటారు! అబద్ధం అయినా సరే వెండితెర మీద కనిపిచేదంతా నిజమని భ్రమించి మళ్లీ మళ్లీ థియేటర్లవైపు పరుగులు తీస్తుంటారు!

 

సినిమాని ఊరికే ప్రేక్షకుడిగా చూడటం తప్పు కాదు. కాని, ఒక హీరోకు అభిమాని కావటం చాలా ప్రమాదకరం. ఆ అభిమానం ఏ మాత్రం ముదిరిపోయినా సదరు అభిమాని అభిమన్యుడైపోతాడు! హీరోగారి పిచ్చిలో పడి... తనకు తానే ఓ పద్మవ్యూహం సృష్టించుకుని అందులోనే మరణిస్తాడు! ఇంకా గట్టిగా చెప్పాలంటే సాలెపురుగు కట్టిన దారాల గూటిలోకి వెళ్లిన తరువాత ఏ పురుగూ తిరిగి రాదు. కరడుగట్టిన పిచ్చాభిమానులూ అంతే! తమ అభిమానానికి తామే బలైపోతారు!

 

ఈ మధ్య జరిగిన పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ అందరికీ తెలిసిందేగా! తిరుపతికి చెందిన వినోద్ రాయల్ పవన్ అభిమాని. అందుకే, కర్ణాటకలోని కోలార్ దాకా వెళ్లి అవయవ దాన కార్యక్రమంలో పాల్గొన్నాడు! ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం. ఇదే కాదు, చాలా హీరోల ఫ్యాన్స్ తమ హీరోలు చెప్పినా , చెప్పకపోయినా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులు, యువరత్న బాలయ్య అభిమానులు ఎన్నో మంచి పనులు చేయటం మనం చూస్తూనే వుంటాం... 

 

ఫ్యాన్స్ హీరో పై అభిమానంతో సమాజ సేవ చేయటం నాణానికి ఒక వైపు మాత్రమే. కాని,అసలు వికృత స్వరూపం మరొకటి వుంటుంది. అందరు అభిమానులు కాకపోయినా... అభిమన్యుల్లా హీరోల ఇమేజ్ సాలెగూటిలో ఇరుక్కుపోయిన కొందరు వీరాభిమానులు మాత్రం నానా రచ్చ చేస్తుంటారు. వీళ్లు ఎక్కడ వుంటే అక్కడ సర్వనాశనమే! కారణం... హీరోల అభిప్రాయాలతో సంబంధం లేకుండా వీళ్లు పెట్టుకునే పంచాయితీలే!

 

మీరు ఒక్కసారి ఏ ఫేస్బుక్ పేజీల్లోనో, లేదంటే బాగా పాప్యులర్ అయిన ఇంటర్నెట్ సినిమా వెబ్ సైట్స్ లోనో చూడండి.... అంతా తెలిసిపోతుంది! ఓ హీరోగారి ఫ్యాన్స్ మరో హీరోగారిని దుమ్మెత్తిపోస్తుంటారు కామెంట్స్ లో. అదీ సాధ్యమైనంత దరిద్రగొట్టు బూతులతో! వాట్ని సంస్కారం వున్న ఎవడు కనీసం రిపీట్ కూడా చేయలేడు. అంతే కాదు, ఈ ఉన్మాద ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హీరోల్ని, వాళ్ల ఇంట్లోని లేడీస్ ని, వాళ్ల కులాన్ని, వాళ్లతో నటించిన హీరోయిన్స్ ని ... ఇలా అందర్నీ దుర్భాషలాడతారు! నోటికి వచ్చిందల్లా వాగేస్తారు! అందుకు ప్రతిఫలంగా ఎదుటి హీరో అభిమానులు కూడా అమ్మ నా బూతులు తిడుతు అరాచకం మొదలుపెడతారు!

 

ఒకప్పుడు ఇంటర్నెట్ లాంటివి లేని సమయంలో హీరోల ఫ్యాన్స్ కాలేజీల్లో, వీధుల్లో, థియేటర్ల వద్ద కొట్టుకు చచ్చేవారు. ఇప్పడు ఇంటర్నెట్ కి మకాం మారింది. అయితే, కామెంట్స్ సెక్షన్లో మాటలతో సరిపెట్టుకున్నారా అంటే అదీ లేదు. హీరోగారి పై అభిమానానికి కుల పిచ్చి కూడా జోడించి సదరు అభిమాన ఉగ్రవాదులు నిజంగానే కొట్టుకునే దాకా వెళుతున్నారు. ఈ మధ్య చాలా సార్లు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి, మరో హీరో ఫ్యాన్స్ కి గొడవ అని మనం బ్రేకింగ్ న్యూస్ లు చూస్తూనే వున్నాం. ఇందులో ఏ హీరో ఫ్యాన్స్ కూడా వెనుకబడటం లేదు. పవన్ కళ్యాన్ జనసేన పార్టీ ఒకటి వుండటం, అలాగే బాలయ్య, ఎన్టీఆర్ లకు టీడీపి పార్టీతో దగ్గరి సంబంధాలు వుండటంతో సెన్సేషనలైజ్ అవుతున్నాయి. కాని, గొడవలు దాదాపు అందరి హీరోల అభిమానుల మధ్య జరుగుతూనే వున్నాయి! చాలా సార్లు గాయాలతో పోయినా అప్పుడప్పుడూ ప్రాణాలు కూడా పోతున్నాయి. అందుకు, తాజాగా జరిగిన వినోద్ రాయ్ హత్యే ప్రత్యక్ష సాక్ష్యం. పవన్ అభిమాని అయిన వినోద్ ని ఎన్టీఆర్ అభిమానినని చెప్పుకునే వ్యక్తి చంపేశాడంటున్నారు. అసలు ఇలాంటి అభిమాని వున్నాడంటే తారక్ మాత్రం సంతోషిస్తాడా? ఏ హీరో కూడా తనకు హంతుకులు, గూండాలు అభిమానులు కావాలని కోరుకోడు. ఇంకా చెప్పుకుంటే, తనకు పిచ్చిపట్టిన మతిస్థిమితం లేని అభిమానులు కావాలని ఏ హీరో కోరుకోడు!

 

సైకలాజికల్ గా ఈ ఫ్యాన్స్ మెంటాలిటీ గమనిస్తే... ఒక్క విషయం తెలిసిపోతుంది. వీళ్లంతా తమ హీరోని అడ్డుపెట్టుకుని ఇగో సాటిస్ ఫై చేసుకుంటూ వుంటారు. తమ హీరో విజయాల్ని చూపిస్తూ తాము ఊరికే తిని తిరుగుతుంటారు. బాగా చదువుకున్న , పెద్ద ఉద్యోగాలు చేసే ఉన్మాద ఫ్యాన్స్ కూడా అక్కడక్కడా వుండొచ్చు. కాని, రోడ్లపై పడి కొట్లాటలకు రెడీ అవ్వటం చాలా వరకూ పని పాటా లేని వాళ్లే చేస్తుంటారు. 

 

ఇక ఆంధ్ర ప్రాంతంలో ఈ హీరో వర్ షిప్ కి కులం పిచ్చి కూడా జోడుకావటం మరింత ప్రమాదకరంగా తయారవుతోంది. దీనికి అత్యంత సరైన పరిష్కారం... అభిమానపు పిచ్చి పట్టి అభిమన్యుల్లా తయారవుతున్న తమ పిల్లల్ని ఇంట్లో వాళ్లే ఓ కంట గమనిస్తూ ఎప్పటికప్పుడు మత్తు వదిలిస్తూ వుండాలి. మా వాడు ఫలానా హీరోకి డై హార్డ్ ఫ్యానండీ... అని తెలివి తక్కువగా కితాబులు ఇవ్వవద్దు! 

 

భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న మన హీరోలు కూడా తమలో తమకు ఎలాంటి విభేదాలు లేవని ఫ్యాన్స్ కోసం కలిసి కనిపిస్తే బావుంటుంది. వాళ్లను కొట్టుకు చావొద్దని పిలుపునిస్తే ఇంకా బావుంటుంది. అసలు ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించినట్లు మల్టీ స్టారర్స్ చేస్తే ఇంకా ఇంకా బావుంటుంది! ఎందుకంటే, ఊరికే పైపై మాటలుగా అభిమానులు కొట్టుకోకండి అంటే పెద్దగా లాభం వుండదు. తమ మధ్య నిజంగా స్నేహం వుందని నిరూపించుకునేలా కలిసి నటిస్తే ఫ్యాన్స్ కూడా తమ అరాచకం పక్కన పెడతారు. లేదంటే అప్పటి వరకూ ఈ పవన్ కళ్యాణ్ వర్సెస్ జూ. ఎన్టీఆర్, చిరంజీవి వర్సెస్ బాలయ్య, మహేష్ బాబు వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ న్యూసెన్స్ కొనసాగుతూనే వుంటుంది!