పవన్‌ది ఆర్భాటం... జగన్‌ది ఆరాటం… చంద్రబాబుకే ఆస్కారం!

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం అంటే ఎవరు? వైసీపీ అధినేత జగన్, ఆయన ఎమ్మెల్యేలు! అయితే, వారు అసెంబ్లీని, పార్లెమంట్ ను కూడా బహిష్కరించి రోడ్లపై తిరుగుతున్నారు. అందులో లాజిక్ ఏంటో జగన్ కే తెలియాలి! అయితే, ఒక్క ఎమ్మెల్యే సీటు లేకున్నా జనసేన కూడా ప్రతిపక్ష గుడారంలోనే చలికాచుకుంటోంది! 2014లో అధికార టీడీపీకి మిత్రపక్షంగా ప్రస్థానం మొదలు పెట్టి ఇప్పుడు పూర్తిస్థాయిలో అపోజిషన్ అయిపోయింది. అది తప్పేం కాకపోయినా… చంద్రబాబును టార్గెట్ చేయాలనే తాపత్రయంలో పవన్ జగన్ కంటే ఎక్కువ తొందరపడిపోతున్నారు! సినిమా గ్లామర్ కలిసొచ్చే విషయమే అయినా దాన్ని సమర్థంగా వాడుకుని ఓట్లుగా మార్చుకునే వ్యవహార శైలి అస్సలు ప్రదర్శించటం లేదు!

 

 

ప్రతిపక్షాలంటే అధికార పక్షాన్ని తిట్టాలి. సీఎంని ఆడిపోసుకోవాలి. అంత వరకూ ఓకే. కానీ, వైసీపీ, జనసేన లాంటి రెండు పార్టీలు పెట్టుకుని, వాటికి అధినేతలమని చెప్పుకునే వారు ఎంత సీరియస్ గా పాలిటిక్స్ చేయాలి? మీడియాలో ఎప్పటికప్పుడు అన్నీ రికార్డ్ అవుతుంటాయి. అటువంటప్పుడు పవన్, జగన్ లు ఏది మాట్లాడినా జనం ప్రతిస్పందనని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. కానీ, ఇద్దరు యువనేతలూ ఆ పని చేస్తున్నట్టు కనిపించటం లేదు. ఈ మధ్యే పబ్లిగ్గా కాపు రిజర్వేషన్లపై  ఏదేదో మాట్లాడి గాలికిపోయే దాన్ని నెత్తిన వేసుకున్నారు జగన్. ఆయన నాన్ సీరియస్ పాలిటిక్స్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఋజువయ్యాయి…

 

 

మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకు? అందుకు తగిన వాదనలు, కారణాలు గవర్నమెంట్ వద్ద వుండే వుంటాయి. కానీ, అవేవీ పట్టించుకోకుండా జగన్ మధ్యాహ్న బోజన పథకం ప్రైవేట్ వారికి ఇవ్వద్దని రోడ్డెక్కని మహిళలకి మద్దతు ప్రకటించారు! ఇదీ సంతోషమే! ప్రతిపక్ష నేతగా ఆయన అలాగే చేయాలి. కానీ, సమస్య ఏంటంటే… రోడ్డుపైన వున్న మహిళల్ని ఆయన నేరుగా వెళ్లి పరామర్శించలేదు. పోనీ ఆయన పార్టీ నుంచీ ప్రముఖ నేతలైనా వెళ్లి మద్దతు పలకలేదు. కేవలం ట్విట్టర్ లో నాలుగు లైన్లతో సరిపెట్టారు! అదీ ఏమని? షరా మామూలుగా నేను సీఎం అయితే మధ్యాహ్నా భోజన పథకం ప్రైవేట్ సంస్థలకు అప్పగించను, నిరసనలు తెలుపుతున్న మహిళలకే అప్పజెబుతాను, బిల్లు సకాలంలో చెల్లిస్తాను, మరింతగా నిధులు కేటాయిస్తాను! ఇదీ వరస! కాపు కార్పోరేషన్ కి వెయ్యి కోట్లు మొదలు మద్యాహ్న బోజన పథకం వరకూ అన్నిటికి తాను సీఎం అయితే ఏం చేస్తారో చెబుతున్నారు కానీ… జగన్ ఇప్పుడు ఏం చేస్తారో చెప్పటం లేదు! మధ్యాహ్న బోజనం మహిళలకు మద్దతుగా వైసీపీ శ్రేణులు నిరసనలు చేయాలని మాట వరసకి కూడా జగన్ చెప్పలేదు!

 

 

ఇక ఇప్పుడు పవన్ విషయానికొద్దాం… కర్నూల్ జిల్లాలో క్వారీల్లో మంటలు చెలరేగి కొందరి ప్రాణాలు పోయాయి. కొందరికి గాయాలయ్యాయి. నిజంగా పెద్ద విషాదం. కానీ, అమాంతం అక్కడ వాలిన జనసేనాని పరామర్శ కంటే హంగామా చేశారు. క్వారీల్ని సందర్శించిన ఆయన చనిపోయిన వారి బంధువుల్ని ఓదార్చారు. గాయపడ్డ వార్ని పరామర్శించారు. అంత బాగానే వున్నా కర్నూల్ లో ఎంటరైన ఆయనకు జనసేన కార్యకర్తలు భారీ ఆహ్వానం పలికారు. వాహనాలతో ర్యాలీ చేసి దుమ్ము రేపారు. యధావిధిగా పవర్ స్టార్ కోసం కేరింతలు కొట్టారు! వేలాది జనం మధ్యలో పవన్ చంద్రబాబుపై రెగ్యులర్ విమర్శలు చేసేశారు. అసలు క్వారీల్లో ప్రమాదం వల్ల జనం చనిపోతే రోడ్లపై జనసేన కోలాహలం ఏంటి? పవన్ కే తెలియాలి! తన యాత్రలో భాగంగా ఎలాగూ కర్నూల్ వస్తారు కదా… అప్పుడు హడావిడి చేయవచ్చు కదా? అవతల అభాగ్యుల ప్రాణాలు పోయినప్పుడే పార్టీ ప్రచారం కూడా జరిగిపోవాలా?

 

 

పరామర్శకని వచ్చి నినాదాలు, ర్యాలీలు చేయటం పక్కన పెడితే…. క్వారీ దుర్ఘటన గురించి పవన్ ఏమన్నారు? జగన్ మధ్యాహ్న భోజన పథకం గురించి ట్వీట్లు చేసినట్టే ఈయనా సెలవిచ్చారు. అక్రమ క్వారీల్ని మూసివేయకుంటే తమ జనసైనికులే ఆ పని చేస్తారని హెచ్చరించారు! ఇది సీపీఎం, సీపీఐ వారి కమ్యూనిస్టు ఉద్యమాల భాషే తప్ప సమస్యకి ఎంత మాత్రం పరిష్కారం చూపేది కాదు! అక్రమ క్వారీలు , వాటి వల్ల ప్రమాదాలు నిజమే అయితే ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. అంతే కాని, పబ్లిక్ లో నిలబడి చంద్రబాబుని పేరు పెట్టి విమర్శిస్తూ నాలుగు హెచ్చరికలు చేసి వెళ్లిపోతే ఏం లాభం? పాలనలో అపార అనుభవం వున్న బాబు ఇలాంటి తాటాకు చప్పుడు హెచ్చరికలు ఎన్ని విని వుండరు?

 

 

మొత్తంగా ప్రతిపక్ష నేతలుగా మీడియాలో చెలామణి అవుతున్న పవన్, జగన్ ఇద్దరూ మరింత బాధ్యతాయుతమైన రాజకీయం చేస్తే బావుంటుంది. సమైక్య రాష్ట్రానికి, నవ్యాంధ్రకి రెండిటికీ సీఎంగా పని చేసిన చంద్రబాబు వీళ్లు ఎంత బాధ్యతా రాహిత్యంగా కామెంట్స్ చేస్తే అంత తేలిగ్గా ఢీకొని ముందుకు వెళ్లిపోతారు. కాబట్టి వైసీపీ అధినేత, జనసేనాని ఇద్దరూ మరింత మెచ్యూర్డ్ గా తమ రోడ్ షోలు, ట్వీట్టర్ షోలు నడిపించాల్సిన అవసరం వుంది! లేదంటే మరోమారు జనం చంద్రబాబుకే జైకొట్టేస్తారు…