జగన్ నే పూజిస్తారా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విష్ణుమూర్తితో పోల్చుతూ టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులు  రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీక్షితుల వ్యాఖ్యలపై విపక్షాలతో పాటు హిందుత్వ సంఘాలు, స్వామిజీలు మండిపడుతున్నారు. శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి తీవ్రస్థాయిలో స్పందించారు. టీటీడీ బోర్డు రాజకీయాలకు అడ్డాగా మారిందనిఆరోపించారు. 

ముఖ్యమంత్రిని  విష్ణుమూర్తితో పోల్చడం జగన్‌కే ప్రమాదమన్నారు పరిపూర్ణానంద స్వామి. విష్ణు అనుగ్రహంతో రాజయోగం ఉంటుందని.. రాజునే విష్ణువుగా పోల్చకూడదని చెప్పారు. వైసీపీ నేతలు వేంకటేశ్వర స్వామికి చేసినట్లు జగన్‌కూ పూజలు చేస్తారా? అని పరిపూర్ణానంద ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చిన రమణదీక్షితుల వ్యాఖ్యలను సీఎంతో పాటు వైసీపీ నేతలంతా ఖండించాలన్నారు. పింక్‌ డైమండ్‌ ఏమైందని..   వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎందుకు దానికి ప్రస్తావన రావడం లేదని ఆయన నిలదీశారు.  

తిరుపతి ఎన్నికల ప్రచారానికి వస్తున్న సీఎం జగన్ కు ఆయన మూడు ప్రశ్నలు సంధించారు పరిపూర్ణానంద స్వామి. టీటీడీని సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. రెండేళ్లుగా తితిదే ఆస్తులపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని.. ఆలయాల కూల్చివేతలపై స్పందించడం లేదెందుకని నిలదీశారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని కోరారు పరిపూర్ణానంద స్వామి.