ప్రపంచంపై మరో నల్లబాంబు

ప్రపంచ వ్యాప్తంగా నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పనామా పేపర్స్ గుర్తుందా.. అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు నిర్థారణ కావడంతో ఎంతోమంది సామాన్యుల నుంచి దేశాధినేతల వరకు కటకటాల పాలవ్వగా.. కొందరు పదవులను కోల్పోయారు. తాజాగా కొందరు ప్రముఖుల అక్రమ ఆర్థిక లావాదేవీలను బహిర్గతపరుస్తూ ప్యారడైజ్ పేపర్ల పేరుతో మరో జాబితా బయటికి వచ్చింది.

 

ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ( ఐసీఐజే ) ఇందుకు సంబంధించిన 13.40 లక్షల కీలక రహస్య పత్రాలను వెల్లడించింది. పన్నుల బెడదలేని స్వర్గధామాలుగా పేరుపొందిన దేశాల్లో ప్రముఖులు పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ కీలక పత్రాల్లో మొత్తం 180 దేశాలకు చెందిన వారి వివరాలు ఉన్నాయి. బ్రిటన్ రాణి ప్రైవేట్ ఎస్టేట్ తరపున రహస్యంగా విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని.. దీనిలో భాగంగా పది మిలియన్ పౌండ్ల ధనాన్ని విదేశాలకు పంపించారని.. లాంకెస్టర్ రాకుమారి సాయంతో కేమ్యాన్ దీవులు, బెర్ముడాలో పెట్టుబడులు పెట్టారని ఈ పత్రాలు చెబుతున్నాయి.

 

అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అల్లుడికి చెందిన కంపెనీలో అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్‌కు పెట్టుబడులు ఉన్నట్లు కూడా ప్యారడైజ్ పేపర్స్ వెల్లడించింది. ప్రఖ్యాత కంపెనీలైన నైక్, ఫేస్‌బుక్ తదితర సంస్థలు కూడా పన్ను ఎగ్గొట్టేందుకు విదేశాల్లో సొమ్ము దాచుకున్నాయని నిర్థారణ అయ్యింది. మరోవైపు ఈ వ్యవహారంలో పలువురు భారతీయుల పేర్లు కూడా వెల్లడయ్యాయి. సంఖ్యాపరంగా భారతదేశం ఈ జాబితాల 19వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాను బీబీసీ పనోరమా పేరుతో దాదాపు 100 మీడియా సంస్థలు వీటిని విశ్లేషిస్తున్నాయి.