పల్నాడులో యుద్ధ వాతావరణం... ఏ క్షణాన ఏం జరుగుతుందో..?

పల్నాడులో యుద్ధ వాతావరణం నెలకొంది. రాజకీయ దాడులపై ప్రతిపక్ష టీడీపీ.... అధికార వైసీపీ... పోటాపోటీగా ఛలో ఆత్మకూరుకు పిలుపునివ్వడంతో.... పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. జమ్మూకశ్మీర్ తరహాలో అడుగడుక్కీ బలగాలను మోహరించడంతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు పల్నాడు అంతటా 144 సెక్షన్‌, పోలీస్ యాక్ట్ 30 విధించారు. పల్నాడులో ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలాఉంటే, ఛలో ఆత్మకూరు పిలుపుతో గుంటూరు టీడీపీ కార్యాలయం దగ్గర పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగుదేశం శ్రేణులు పెద్దఎత్తున తరలివస్తుండటంతో భారీగా బలగాలను మోహరించారు. తెలుగుదేశం కార్యాలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పటికే ముందస్తు అరెస్టులు మొదలుపెట్టిన పోలీసులు.... జిల్లాల్లో ఎక్కడికక్కడ టీడీపీ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఉండవల్లి నివాసంలో హౌస్ అరెస్ట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది.

మొత్తానికి టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఛలో ఆత్మకూరు పిలుపుతో పల్నాడులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. సేవ్ డెమోక్రసీ పేరుతో తెలుగుదేశం.... సేవ్‌ పల్నాడు పేరుతో వైసీపీ... యుద్ధానికి సిద్ధమవడంతో... ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి.