వీర హిందుత్వ V/S అరివీర సెక్యులరిజమ్!

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే... మరొకడొచ్చి మంటల్లో ఇంకేదో కాల్చుకున్నాడట!అలాగే వుంది ఇప్పుడు కొందరు రాజకీయ నేతల వ్యవహారం!ఒకవైపు యూరి ఉగ్రదాడి... దాదాపు ఇరవై మంది జవాన్లు అమరులయ్యారు.దేశం మొత్తం కోపంతో రగిలిపోతుంది.పాక్ పై యుద్ధం చేయాల్సిందేనంటోంది.కాని,ఇంత సందడి మధ్యలోనే కొందరు నడేమియాలు తయారయ్యారు!వాళ్లకు కావాల్సిన పొలిటికల్ బిస్కెట్ల కోసం వాళ్లు తమ వంతుగా మొరగటం మొదలు పెట్టారు... 
ఈ మధ్య బాలీవుడ్లోకి పాకిస్తానీ కళకారులు రావటం ఎక్కువైంది.వీణా మలిక్ లాంటి ఐటెంగాళ్స్ మొదలు ఫవాద్ ఖాన్ లాంటి హీరోల వరకూ చాలా మందే ఇక్కడికొచ్చి తిష్ఠవేస్తున్నారు.దీని వెనుక రహస్యం ఏంటో మనకు తెలియదుగాని బాలీవుడ్ పిల్మ్ మేకర్స్ కూడా ఈ పాకీ హీరోలు,హీరోయిన్స్,సింగర్లను నెత్తిన పెట్టుకుంటున్నారు.అత్యంత సింపుల్ లాజిక్ అయితే వీళ్ల ద్వారా పాకిస్తాన్లో మన హిందీ సినిమాల్ని అమ్ముకోవచ్చు.పాకిస్తానీ నటులు, సింగర్లు వుంటే ఇంకాస్త ఎక్కువగా చూస్తారు అక్కడి జనం. కాకపోతే,ఎవరూ లేకున్నా మన బాలీవుడ్ స్టార్టకే అక్కడ బోలెడు క్రేజ్ వుంది.అయినా కూడా పాకీల్ని తెచ్చి ఇక్కడ సినిమాల్లో చూపించటం వెనుక మరో వాదన కూడా వుంది.
బాలీవుడ్ సినిమాలకు పెద్ద ఎత్తున మాపియా సొమ్ము అక్రమంగా వస్తుంటుందని, అది పాక్ నుంచే వస్తుందని అంటారు.కాబట్టి మాపియా వాళ్లు చెప్పిన పాకిస్తానీ హీరో,హీరోయిన్స్ ని బాలీవుడ్ సినిమాల్లో పెట్టుకోవటం అనివార్యం అవుతోంది.అలా వచ్చిన వారి కోసం ఇక్కడ గొడవలు కూడా ఈ మధ్య  సర్వసాధారణం అయిపోయాయి.కొందరు పాకిస్తాన్ వాళ్లు మనకు వద్దంటే మరికొందరు కావాలంటారు. అమన్ కీ ఆశా లాంటి పిచ్చి పిచ్చి స్లోగన్స్ ఇస్తూ పాకిస్తానీ కళాకారుల్ని నెత్తిన పెట్టుకునే మేధావులు, మీడియా వాళ్లు,బాలీవుడోళ్లు పెద్ద సంఖ్యలోనే వున్నారు.వీళ్లకి వ్యతిరేకంగా రంగంలోకి దిగుతారు వీర జాతీయవాదులు!
కొన్నాళ్ల కిందటి దాకా ముంబైలో అరివీర జాతీయ వాదం అంటే శివసేన గుర్తుకు వచ్చేది.పాకిస్తాన్ అంటే ఆగ్రహంతో ఊగిపోయే వారు బాల్ థాక్రే కార్యకర్తలు.క్రికెట్ పిచ్ లు తోడేయటం లాంటి పనులు చేసి దేశభక్తి చాటుకునే వారు.కాని, పెద్దాయన చనిపోయాక శివసేన చల్లబడింది.మంచికో చెడుకోగాని మహరాష్ట్ర నవనిర్మాణ సేన రంగంలోకి దిగింది.ఈ మధ్య ఎవర్ని కొట్టాలన్నా, తన్నాలన్నా రాజ్ థాక్రే వాళ్ల ఎంఎన్ఎస్ వంతే!
పాక్ తో యుద్ధం వరకూ పరిస్థితి రావటంతో రాజ్ థాక్రే తన వంతుగా చెలరేగిపోయాడు. రెండు రోజుల్లో బాలీవుడ్లోని పాకిస్తానీ నటులు, టెక్నీషియన్స్ ఇంటికి వెళ్లకపోతే తామే గెంటేస్తామని అన్నాడు!ఇలాంటి మాటలు ఎంఎన్ఎస్ నిజంగా పాకిస్తాన్ పై కోపంతో అంటే సంతోషించవచ్చు.కాని,ఇది ఆ పార్టీ రెగ్యులర్ వ్యూహం. వయోలెంట్ గా హెచ్చరికలు చేయటం, దాడులు చేయటం వారికి అలవాటైపోయింది. దీర్ఘకాలంలో వాళ్లు దేశం కోసం చేస్తున్నది ఏమీ లేదు. ఊరికే భయానక పరిస్థితులు సృష్టించి మరో వర్గానికి కావాల్సినంత పని కల్పిస్తారు!
శివసేన,ఎంఎన్ఎస్ లాంటి అతి వాద హిందూ సంస్థలకి బద్ధ వ్యతిరేకం సమాజ్ వాది పార్టీ, ఎంఐఎం, ఆర్జేడీ, జనతాదళ్ లాంటి సెక్యులర్ ముఠాలు. వీరు ముస్లిమ్ ల కోసమే బతికి వున్నట్టు కలరింగ్ ఇస్తూ రచ్చ చేస్తుంటారు.ఇండియన్ ముస్లిమ్ ల గురించే కాదు పాకిస్తాన్ గురించి ఏమన్నా వీరికే పొడుచుకు వస్తుంది. తాజాగా రాజ్ థాక్రే పాకిస్తానీ కళాకారుల్ని టార్గెట్ చేస్తే సమాజ్ వాది అధినేత ములాయం కోపంతో ఊగిపోయాడు.ఎంఎన్ఎస్ అధినేత కళాకారుల్ని పాక్ కు పంపేయటం కాదు ఆ దేశానికి మానవ బాంబుల్ని పంపాలి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ప్రజాస్వామ్య పార్టీకి అధ్యక్షుడు అయి వుండి ఆయన అలా మాట్లాడటం సబబా? అడిగే వాడే లేడు! 
ఒకవైపు వీర హిందూత్వ వినిపించే పార్టీలు , మరో వైపు మైనార్టీల కోసమే బతికే అరివీర పార్టీలు... ఈ రెండూ వీలున్నప్పుడల్లా రచ్చ చేస్తూనే వున్నాయి. ఈ గొడవల వల్ల దేశానికి లాభం లేకపోగా హిందూ, ముస్లిమ్ ల మధ్య దూరం మరింత పెరిగే అవకాశం వుంది.అంతకంటే మించి అంతర్జాతీయ సమాజం ముందు భారత్ పరువు పోయే ప్రమాదం ఖచ్చితంగా వుంది!