బాబు, షర్మిల పాదయత్రలకి మళ్ళీ బ్రేక్ పడనుందా?

 

త్వరలో జరగనున్న శాసన మండలి ఎన్నికల దృష్ట్యా ఈ నెల 19వతేది సాయంత్రం నుండి 21వ తేది ఉదయం వరకు సంబందిత తెలంగాణా, గుంటూరు, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించారు. అందువల్ల తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ నాయకుల పాదయాత్రలను ఆ తేదీల మద్య తప్పనిసరిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసారు.

 

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం గుంటూరులో పాదయత్ర చేస్తుండగా, షర్మిల నల్గొండ జిల్లాలో చేస్తున్నారు. రెండు ప్రాంతాలలో ఎన్నికల నియమావళి అమలులోకి రానున్నది గనుక, ఆ ఇద్దరూ నేతలూ కూడా ఆ తేదీల మద్య తప్పని సరిగా తమ పాదయాత్రలు నిలిపివేయవలసి ఉంటుంది.

 

అయితే, షర్మిల నల్గొండ జిల్లాలో తానూ నిర్ణయించుకొన్న అన్ని ప్రాంతాలలో 19వతేది నాటికి పాదయాత్ర ముగించుకొని, గుంటూరులో అడుగుపెట్టే అవకాశం ఉంది గనుక, ఆమె నల్గొండ జిల్లా పాదయాత్రకు ఎటువంటి అడ్డంకులు ఉండకపోవచ్చును. ఏకారణాల వల్లనయినా ఆమె పాదయాత్ర ఎక్కడయినా ఆలస్యం అయినట్లయితే, మిగిలిన ప్రాంతాలలో ఆమె వడివడిగా పాదయాత్ర చేసుకోవడమో లేదా ఆమె తన పాదయాత్రలో కొన్ని ప్రాంతాలను వదులుకొని నేరుగా గుంటూరు చేరుకోవడమో, లేదా 21వ తేది వరకు తన పాదయాత్రను వాయిదావేసుకొని తిరిగి నల్గొండలోనే ప్రారంభించడమో చేయవలసి ఉంటుంది. అయితే, ఆమె ఈ లోగానే, నల్గొండ జిల్లాలో అన్ని ప్రాంతాలను సందర్శించడం పూర్తవుతుందని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. అయినప్పటికీ, సరిగ్గా ఎన్నికల నియమావళి అమలయ్యే రోజునే ఆమె గుంటూరులో ప్రవేశిస్తారు గనుక, తన గుంటూరు పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకోవలసిరావచ్చును.

 

ఇక, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు స్థానిక ఎన్నికల అధికారిని కలిసి తమ అభ్యంతరాలను తెలియజేయనున్నారు. గత నాలుగు నెలలుగా చంద్రబాబు పాదయత్ర చేస్తున్నందున, ఈ ఎన్నికలకీ ఆయన పాదయాత్రకి ఏవిధమయిన సంబంధంలేదని, అందువల్ల తమ నాయకుడి పాదయాత్రకు అనుమతినీయాలని, ఇచ్చినట్లయితే తాము ఎన్నికల నియమావళికి లోబడే పాదయాత్ర చేసుకొంటామని విన్నవించనున్నారు.

 

ఒకవేళ తెలుగుదేశం పార్టీకి అనుమతినిచ్చినట్లయితే, అప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదేవిధమయిన అభ్యర్ధన చేసే అవకాశం ఉంది. కానీ, వారి పాదయాత్రలు ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం ఉనందున వారి అభ్యర్ధనను ఎన్నికల కమీషన్ తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. అప్పుడు చంద్రబాబు, షర్మిల ఇద్దరూ కూడా తప్పనిసరిగా తమ పాదయాత్రలు వాయిదావేసుకోక తప్పదు. కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారిద్దరూ బహుశః ఈ కారణంగా తమ పాదయాత్రలు వాయిదా వేసుకొని రెండు రోజులు విశ్రాంతి తీసుకొనే అవకాశం ఉంది.