ప్రభుత్వాన్ని నిలదీయడంలో విఫలమయిన ప్రతిపక్షాలు

 

కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ, యుపీయే ప్రభుత్వంలో బయటపడుతున్న కుంభకోణాలను, అవినీతి భాగోతాలను ఎప్పటికప్పుడు పార్లమెంటులో గట్టిగా ఎండగడుతూ అవినీతికి పాల్పడిన మంత్రులను ఇంటికి సాగనంపడంలో విజయవంతం అవుతుంటే, ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలయిన తెదేపా, తెరాస, మరియు వైయస్సార్ కాంగ్రెస్ మూడు కూడా ఈవిషయంలో విఫలమవుతున్నాయి.

 

ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్న ఈ మూడు పార్టీలు కూడా అంతర్గత కలహాలతో, వలసలతో సతమతమవుతూ, ఇంటిని చక్కదిద్దుకొనే ప్రయత్నంలో ప్రతిపక్ష పార్టీలుగా తమ బాధ్యతను సమర్ధంగా నిర్వర్తించలేకపోతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షపార్టీ అయిన తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం వెనకేసుకువస్తున్న సీబీఐ చార్జ్ షీటుకెక్కిన మంత్రులను బయటకి పంపించడంలో ఘోరంగా విఫలమయింది.

 

ఇంతవరకు పాదయాత్రలు, ఇప్పుడు పార్టీలో వలసలు, అంతర్గత కలహాలపైనే ఆపార్టీ దృష్టి కేంద్రీకరించకరించడంతో ఆ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే తీరిక శ్రద్ద రెండూ లేకుండాపోయాయి.

 

ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ సమస్యలకి అదనంగా తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైలు, బెయిలు అంశాలతో తీరిక లేకుండా ఉంది.

 

తెరాస అధినేత కేసీఆర్ కి ఇప్పుడు పూర్తిగా ఎన్నికల మైకం కమ్మి ఉన్నందున, ఆయనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి కూడా తీరికదొరకడంలేదు.

 

అందువల్లనే రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిన మంత్రుల్ని అంత దైర్యంగా వెనకేసుకురాగలుగుతోంది. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసినపుడు, కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులు, కేసుల గురించి భయపడలేదు. కానీ, ఈ విషయంలో ప్రతిపక్షాలను ఏవిధంగా ఎదుర్కోవాలని బెంగపెట్టుకొంది. అయితే కాంగ్రెస్ పార్టీ అటువంటి బెంగలేమి పెట్టుకొనవసరం లేదని ప్రతిపక్షాలు ఋజువు చేసాయి.

 

కానీ, కేంద్రంలో ప్రతిపక్షాల ఒత్తిడితో యుపీయే ప్రభుత్వం ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికిన తరువాత తెదేపాలో మాత్రం కొంత చలనం వచ్చినట్లుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు తన శాసనసభ్యులతో కలిసి గవర్నర్ నరసింహన్ ను కలిసి రాష్ట్ర ప్రభుత్వంలో కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని కోరుతూ ఒక వినతిపత్రం ఇవ్వడానికి వెళుతున్నారు. అయితే, కళంకిత మంత్రులను తొలగించేందుకు ప్రభుత్వంపై సరయిన ఒత్తిడి తేకుండా ఏదో మొక్కుబడిగా చేయడం వలన ఏ ప్రయోజనం లేదు.

 

రెండు నెలల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు చార్జీల పెంపుకు ఆమోదం తెలిపినప్పుడు ప్రతిపక్షాలన్నీ తమ పోరాటపటిమ చూపించి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి కరెంటు చార్జీల పెరుగుదలలో (కేవలం 200 యూనిట్ల వరకు మాత్రమే) కొంతయినా వెనక్కి తగ్గేలా చేయగలిగారు. కానీ అదే పోరాటపటిమని ప్రభుత్వం మళ్ళీ వెంటనే వడ్డించిన సర్ చార్జీలను తగ్గించడం విషయంలో మాత్రం చూపలేకపోయాయి.

 

ప్రతిపక్షాలు తమలో తాము కలహించుకొంటూ, అంతర్గత విభేదాలతో సతమతమవుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన నీడలో కళంకిత మంత్రులు హాయిగా సేద తీరుతున్నపటికీ, తన ప్రభుత్వం స్వచ్చమయిన ప్రజా సంక్షేమ ప్రభుత్వమని గట్టిగా బల్లగుద్ది మరీ చాటింపు వేసుకోగలుగుతున్నారంటే అది ప్రతిపక్షాల వైఫల్యమే. తమకే ఓటువేసి గెలిపించాలని కోరుతున్న ఈ మూడు పార్టీలు కనీసం ప్రతిపక్ష పార్టీలుగా కూడా సక్రమంగా తమ బాధ్యతలు నిర్వర్తించలేన్నపుడు, ఇక ప్రజలు వారికి ఓటేసి అధికారం కట్టబెట్టాలని ఆశించడం దురాశే అవుతుంది.