కేరళ కాంగ్రెస్‌లో కొట్లాట మొదలు

 

ఇప్పటికే సోలార్‌ స్కాంలో పీకల్లోతు మునిగిపోయిన కేరళ కాంగ్రెస్‌కు ఎన్నికల ముందు మరో విఘాతం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్లను కేటాయించే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీకి, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధీరన్‌కి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలవడం కష్టమని ఒపీనియన్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు ఏ సీటు ఎవరికి అందించాలన్న దాని మీద కూడా కొట్లాటలు మొదలయ్యయి.

 

తన అనునాయులకే సీట్లను అందించాలని చాందీ పట్టుబడుతుండగా, సదరు సీట్లను వేరేవారికి ఇవ్వాలని సుధీరన్‌ వాదిస్తున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సోనియాగాంధి ఇరువురితో నేతలతోనూ సమావేశం అయినా కూడా ఫలితం లేకపోయింది. దీంతో మీలో మీరే సమస్యను పరిష్కరించుకోండంటూ, రాష్ట్ర నేతలకు సూచించినట్లు సమాచారం. కేరళలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్న ఇతర పార్టీలు కూడా ఈ వివాదం పట్ల గుర్రుగా ఉన్నాయి. పొత్తుల ప్రకారం తమకి కేటాయించాల్సిన సీట్ల గురించి కూడా కాంగ్రెస్‌ కొట్టుకోవడంతో ఆ పార్టీలు విస్తుపోతున్నాయి. మొత్తానికి కేరళ కాంగ్రెస్ నేతలు పరాజయం వైపుకి నిదానంగా అడుగులు వేస్తున్నట్లున్నారు.