ఇక ఆన్ లైన్లో ఇసుక అమ్మకాలు?

 

దేశంలో మొట్టమొదటిసారిగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్లో ఇసుక అమ్మకాలు జరుపబోతోంది. దీని కోసం ఇప్పటికే ప్రభుత్వం డ్వాక్రా మహిళల సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకొంది. తద్వారా వారికి ఉపాధి కల్పించడమే కాకుండా ఇసుక అక్రమ రవాణాకు అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తోంది. ఆన్ లైన్లో ఇసుక అమ్మకాలకు ప్రభుత్వం అవసరమయిన ఏర్పాటు చేస్తోంది.

 

అవి పూర్తికాగానే ఇసుక కావలసిన ప్రజలు ఎవరయినా ఆధార్ కార్డ్ చూపించి సమీపంలో గల మీ సేవా సెంటర్లలో ద్వారా లేదా దీని కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఐ.కె.పి.-యస్.ఇ.ఆర్.పి. వెబ్ సైటు ద్వారా గానీ కావలసినంత ఇసుకను బుక్ చేసుకోవచ్చును. ఆన్ లైన్లో ఇతర వస్తువులు సేవలు పొందేందుకు ఏవిధంగా ఆన్ లైన్ బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా సొమ్ము చెల్లిస్తామో, అదేవిధంగా ఇసుకకు కూడా సూచించిన మొత్తం చెల్లించిన వెంటనే నమోదు చేసుకొన్న ఫోన్ నెంబరుకి ఇసుక సరఫరా చేసే డ్వాక్రా సంస్థ నుండి ఒక మెసేజ్ వస్తుంది. ఆ తరువాత దగ్గిరలో ఉన్న ఇసుక నిలువ కేంద్రం నుండి ఇసుక తీసుకొని వాహనం బయలు దేరినప్పటి నుండి కొనుగోలుదారు ఇంటికి చేరేవరకు జీపీయస్ పద్దతిలో పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వినియోగదారునికి తెలియజేయబడుతుంది. ఈ ప్రయోగం విజయవంతమయితే తరువాత గృహ నిర్మాణానికి అవసరమయిన సిమెంటు, పిక్క, ఇటుకలు, స్టీల్ వంటివి కూడా ఆన్ లైన్లోనే అమ్మకాలు మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు. ఏమయినప్పటికీ ఇసుకను కూడా ఆన్ లైన్లో అమ్మవచ్చనే ఆలోచన కలగడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.