తూర్పుగోదావరిలో గ్యాస్ పైప్ లైన్ ప్రేలుడు, పది మంది మృతి

 

 

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం ‘నగరం’ గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున గ్యాస్ అధారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)కి చెందిన గ్యాస్ పైప్ లైన్ ప్రేలిపోవడంతో దాదాపు పది మంది మరణించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఓ.యన్.జీ.సి. నుండి గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ కు గ్యాస్ సరఫరా అయ్యే పైప్ లైన్ పేలిపోవడంతో దాదాపు 20మీటర్ల ఎత్తు మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎనిమిది ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ కి కేవలం పది-పదిహేను మీటర్ల దూరంలో ఈ పైప్ లైన్ ప్రేలుడు జరిగినప్పటికీ, అదృష్టవశాత్తు వర్షం పడుతున్న కారణంగా మంటలు గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ వరకు వ్యాపించలేదు. మంటలు స్టేషన్ వరకు వ్యాపించి ఉంటే మరింత భారీ స్థాయిలో ప్రేలుళ్ళు జరిగి, ప్రమాద తీవ్రత పెరిగేది. ఈ గ్యాస్ పైప్ లైన్ నగరం గ్రామం సమీపం నుండి వెళుతున్నందున, ఈ గ్యాస్ సంస్థతో ఎటువంటి సంబందమూ లేని సామాన్య ప్రజలు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. మరణించారు. ఇంతవరకు ఓ.యన్.జీ.సీ. అధికారులు కానీ లేదా పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకోలేదని సమాచారం. రాష్ట్ర హోం మంత్రి చిన రాజప్ప సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి తాను స్వయంగా ఘటనా స్థలికి బయలుదేరుతున్నారు.