ఇండియాలో 2032 ఒలంపిక్స్… అవసరమా? ఆర్భాటమా?

 

ఒలంపిక్స్… ఈ పదం విన్నప్పుడల్లా భారతీయుల మనస్సుల్లో రకరకాల భావాలు కలుగుతుంటాయి! అందుక్కారణం వంద కోట్లు దాటిన జనాభ గల మన దేశం ఇప్పటి వరకూ ఒలంపిక్స్ లో అద్భుతాలు సృష్టించింది లేదు. నాలుగేళ్లకోసారి భారీ టీమ్ తో ఒలంపిక్స్ కు వెళ్లటం, ఒకటి అరా మెడల్స్ తో మెడలు వంచుకుని రావటం మామూలైపోయింది. ఇక వచ్చాక మెడల్స్ తీసుకొచ్చిన ఒకరిద్దర్నే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నర్లు, ఆఖరుకు రాష్ట్రపతి కూడా తోచినంత పొగడటం రొటీన్! ఇలాంటి దుస్థితి బహుశా ప్రపంచంలోని ఏ పెద్ద దేశానికి ఒలంపిక్స్ లో వుండదనుకుంటా!

 

ఇంతకీ… వున్నట్టుండీ ఒలంపిక్స్ గొడవ ఇప్పుడెందుకని అనుమానం వచ్చిందా? కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కారణంగా! 2032లో ఒలంపిక్స్ భారత దేశంలో ఎందుకు నిర్వహించకూడదని ఆలోచిస్తుందట స్పోర్ట్స్ మినిస్ట్రి! మోదీ సర్కార్ అనుమతిస్తే ఒలంపిక్స్ ఇండియాలో నిర్వహించటానికి బిడ్స్ వేయనున్నారట. అదీ 9ఏళ్లు ముందు, అంటే, 2025లో ఇండియా ఒలంపిక్స్ నిర్వహణకు అనుమతి పొందాలి. అప్పుడు 2032లోగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి.

 

నిజానికి భారత్ లో ఒలంపిక్స్ ఇప్పటి వరకూ జరగలేదు. కాబట్టి మనం నిర్వహించుకుంటే బావుంటుంది. కాని, దీని వెనుక రెండు ఆలోచించాల్సిన పరిణామాలు వున్నాయి! ఒకటి…. వేల కోట్లు ఖర్చు పెట్టి ఒలంపిక్స్ నిర్వహించాక మనకొచ్చే మెడల్స్ ఎన్ని? 2032లోగా అద్బుతాలు జరిగి మన క్రీడా రంగం ఒక వెలుగు వెలిగిపోతే తప్ప మామూలుగా అయితే పది మెడల్స్ రావటం కూడా గొప్పే! ఇది నిజానికి ఒక ఆతిథ్యం ఇచ్చిన దేశానికి అవమానకరం! అమెరికా, చైనా లాంటి పెద్ద దేశాలు ఒలంపిక్స్ నిర్వహిస్తే అత్యధిక మెడల్స్ తమకే వచ్చేట్టు క్రీడాకారుల్ని తయారు చేసుకున్నాయి! అలాంటి పరిస్థితి మన దేశంలో రావాలి…

 

ఒలంపిక్స్ వెనుక వున్న మరో ఆందోళనకర అంశం… ఈ భారీ విశ్వ క్రీడా సంరంభం నిర్వహించిన చాలా దేశాలు తరువాత ఆర్దికంగా నానా ఇబ్బందులు పడుతున్నాయి. మొన్నటికి మొన్న బ్రెజిల్ కూడా ఒలంపిక్స్ నిర్వహించి లాభం మాట అటుంచితే… ఆర్దికంగా అతలాకుతలం అయిపోయింది! అసలు ఈ కారణం చేతనే 2028ఒలంపిక్స్ నిర్వహణకి ఏ దేశమూ ముందుకి రావటం లేదట! 2024లో ఒలంపిక్స్ ప్యారిస్ లో జరగనున్నాయి. ప్యారిస్ తో పోటీ పడి ఓడినలాస్ ఏంజెల్స్ నగరానికి 2028 ఒలంపిక్స్ నిర్వహణ బాధ్యత అప్పజెప్పింది అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం! ఇదీ పరిస్థితి!

 

ఆర్దిక భారానికి భయపడి సంపన్న దేశాలే ముందుకు రాని ఒలంపిక్స్ మన దేశానికి ఎందుకు? ముందు క్రీడా రంగం బాగు చేసుకుని ఇతర దేశాల్లో జరిగే ఒలంపిక్స్ లో సత్తా చాటితే… అప్పుడు ఇక్కడ నిర్వహించుకోవటం గురించి ఆలోచించవచ్చు! ఆఫ్ట్రాల్… ఒలంపిక్స్ అంటే లేజర్ షోలు, స్టేడియమ్స్, అథ్లెట్ల కోసం ఏర్పాట్లు మాత్రమే కాదు కదా! ఒలంపిక్స్ అంటే స్వదేశీ క్రీడాకారులు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేయటం! అ స్థితైతే ఇప్పుడు అస్సలు లేదు…