కూర్చునే కుర్చీలే... సమాధులైపోతున్నాయి!

కుర్చీకి అతుక్కుపోవటం ఒకప్పుడు రాజకీయ నేతలకే పరిమితం అయ్యేది! అధికారం పోతుందన్న భయంతో వాళ్లు కుర్చుని వదిలేవారు కాదు! ఇప్పుడూ పొలిటీషన్స్ అలానే వున్నారు! వాళ్ల కుర్చీ వ్యామోహం ఏ మాత్రం తగ్గలేదు! కాని, బాధాకరమైన విషయం ఏంటంటే... కుర్చీ బలహీనత ఇప్పుడు సామాన్య జనానికి కూడా ఎక్కువైపోయింది! ఎంతగా అంటే .. అది ప్రాణాంతకంగా  మారిపోయింది!. కుర్చీ ఎందుకు కావాలి? కూర్చోటానికి! అవును... కూర్చోటమే ఇప్పుడు కొంపలు ముంచుతోంది! కూర్చుంటే చచ్చిపోతున్నారని చెబుతున్నాయి తాజా సర్వేలు! ఇది వినటానికి నమ్మశక్యంగా లేకున్నా పచ్చి నిజం! 


ఆధునిక జీవన శైలిలో మనిషి కూర్చోవటం ఎక్కువైంది. ఒకప్పుడు మనిషి లేచింది మొదలు పడుకునే దాకా అన్ని పనులు తిరిగి చేసుకునేవాడు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ల కాలంలో ప్రతీ పనీ కుర్చీలోనే చేసేస్తున్నాడు! ఒక్క క్లిక్ తో తినటానికి తిండి కూడా టేబుల్ ముందుకు వచ్చేస్తోంది! అంటే , కనీసం హోటల్ కి వెళ్లే శారీరిక శ్రమ కూడా వుండటం లేదన్నమాట! వంట వండుకుని తినటం సంగతైతే దేవుడికే ఎరుక! 


తినటమే కాదు మొత్తం అన్ని పనులు కుర్చీలకే అత్తుకుని చేసేస్తున్నారు ఈ ఆధునిక కాలం కంప్యూటర్ మానవులు. ఫలితంగానే సృష్టిలోని ఏ జీవికి లేని ఒబెసిటీ ప్రాబ్లం మనిషికి వచ్చేసింది! దాంతో పాటూ బోలెడన్ని శారీరిక , మానసిక సమస్యలు కూడా వచ్చిపడుతన్నాయి. ఇప్పుడు అన్నిటికంటే మించి ఆందోళన పరిచే సత్యాలు బయటకొచ్చాయి ఓ సర్వేలో..


స్పెయిన్ లో ఓ యూనివర్సిటి వాళ్లు చేసిన పరిశోధనలో ఎక్కువగా కూర్చునే వారు తొందరగా చనిపోయే ప్రమాదం ఎక్కువగా వుందని తేలింది. ఊరికే కూర్చుంటే చనిపోతారని అర్థం కాకపోయినప్పటికీ కూర్చుంటే అనేక సమస్యలు వచ్చి చావుకి దగ్గరవుతారని భావం! 54దేశాల్లో 2002 నుంచి 2011 వరకూ జరిపిన పరిశోధనల్లో దాదాపు 60 శాతం మంది రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సేపు కూర్చుంటున్నారని తేలింది! అంతే కాదు, ప్రతీ సంవత్సరం చనిపోతున్న వారిలో 3.8శాతం మంది కదలకుండా కూర్చునే మరణిస్తున్నారట! ప్రపంచం మొత్తం మీద ఈ కుర్చీ చావులు ఎక్కువ అవుతూనే వున్నా లెబనాన్ లో మరీ ఎక్కువగా వున్నాయట. మెక్సికోలో మరీ తక్కువగా వున్నాయి. మన దేశం సంగతి రీసర్చర్స్  పట్టించుకున్నట్టు లేదు! కాకపోతే ఇండియాలోనూ ఉబకాయం సర్వసాధారణం అయిపోయింది. అందుక్కారణం కుర్చీలకు అతుక్కుపోవటమే!


చేసే ఉద్యోగాల వల్లో, అందుబాటులోకి వచ్చిన సౌకర్యాల వల్లో ఆధునిక మానవుడు అవసరానికి మించి రెస్ట్ తీసుకుంటున్నాడు! దాని ఫలితంగానే ఆనారోగ్యంతో అరెస్ట్ అవుతున్నాడు! కాబట్టి కులాసాగా వుండాలంటే తక్షణ కర్తవ్యం.. కుర్చీల్ని వదిలి కుందేళ్లలా పరుగులు తీయటమే!