ప్రజల గుండెల్లో కొలువున్న పెద్దన్నకు 90 ఏళ్ళు

 

తెలుగు చిత్ర సీమకి, తెలుగు జాతికి, రాష్ట్ర రాజకీయాలకి పెద్దన్నగా అరుదయిన గౌరవం స్వంతం చేసుకొన్నస్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 90వ జయంతి నేడు. తీయనయిన తెలుగుకు పర్యాయపదంగా, తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపంగా నిలచిన యన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వితంగా కొలువయ్యుంటారు.

 

యన్టీఆర్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923, మే 28న జన్మించారు. 1949లో ‘మన దేశం’ అనే సినిమాతో చిత్ర సీమలోకి ప్రవేశించిన యన్టీఆర్ చివరిగా 1993లో ‘శ్రీనాథ కవిసార్వభౌమ’తో తన 43 ఏళ్ల సుదీర్గ సినీ ప్రస్థానం ముగించారు. ఈ సుదీర్గ యాత్రలో ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా తన బహుముఖ ప్రజ్ఞ కనబరిచి ప్రజల మెప్పు పొందారు.అనేక విశిష్ట గౌరవ పురస్కారాలను కూడా అందుకొన్నారు.

 

ఆయన మొత్తం 320 సినిమాలలో నటించారు. అంతే కాకుండా దేశంలో మరే ఇతర నటుడు చేయలేనన్ని విభిన్న పాత్రలు పోషించారు. ఆయన చేసిన సినిమాలలో ఎక్కువ సాంఘిక చిత్రాలే అయినప్పటికీ, ఆయనకు ఆచంద్రార్కం నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలు ఆర్జించిపెట్టినవి మాత్రం ఆయన చేసిన పౌరాణిక సినిమాలేనని చెప్పవచ్చును. అలాగని ఆయన చేసిన కన్యాశుల్కంలో గిరీశం పాత్రను, రాముడు భీముడు సినిమాలో భీముడి పాత్రను, బడిపంతులు సినిమాలో బడిపంతులు పాత్రను తెలుగు ప్రజలు ఎవరూ ఎన్నటికీ మరిచిపోలేరు.

 

ఇక పౌరాణికాల్లో ఆయన చేసిన శ్రీకృష్ణుని పాత్ర గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 27 ఏళ్లలో నిర్మించిన 25పౌరాణిక సినిమాలలో ఆయన శ్రీకృష్ణుని పాత్ర పోషించారు. శ్రీకృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు అని ప్రజలు కూడా నమ్మేంతగా ఆయన ఆ పాత్రను పండించారు. రావణుడు, దుర్యోధనుడు వంటి దుష్టపాత్రలకు కూడా తన అభినయంతో ప్రాణ ప్రతిష్ట చేసి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ఆయనకే చెల్లు.

 

కేవలం ద్విపాత్రాభినయం చేయడమే గొప్ప అనుకొంటున్న సమయంలో దాన వీర శూర కర్ణ సినిమాలో ఏకంగా మూడు పాత్రలు పోషించి ప్రజల చేత జేజేలందుకొన్నారాయన. ఇక, విజయవంతమయిన నిర్మాతగా, ప్రతిభగల దర్శకుడిగా, కధకుడిగా తెలుగు చిత్ర సీమలో ఆయన విజయకేతనం ఎగురవేశారు.

 

ఆయన నటించిన సినిమాలలో150కి పైగా శతదినోత్సవాలు, 50కి పైగా రజతోత్సవాలు, 7 స్వర్ణోత్సవాలు జరుపుకొన్నాయి. ఆయన మన దేశంలోనే తొలి వంద, రెండు వందల చిత్రాలు చేసిన హీరోగా, తొలి మూడొందల చిత్రాలు చేసిన తొలి తెలుగు హీరోగా నెలకొల్పిన రికార్డును ఇంతవరకు ఎవరూ అధిగమించలేకపోయారు. ఆయన తన స్వీయ దర్శకత్వంలో 18 సినిమాలలో నటించడమే కాకుండా వాటిలో అనేక సినిమాలు శతదినోత్సవాలు కూడా జరుపుకొన్నాయి.

 

ఒకవైపు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తూనే, మరో వైపు సినిమాలలో నటించిన ఘనత కూడా ఆయనకే చెల్లింది. ఆయన ప్రతిభకు పట్టం కడుతూ అనేక అవార్డులు, సన్మానాలు పొందారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మకమయిన పద్మశ్రీ అవార్డును 1968లోనే ఇవ్వడం జరిగింది. అయితే, చిత్రసీమకి ఇంతగా సేవలందించిన ఆయనకి జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు దక్కలేదనే భావన తెలుగు ప్రజలలో ఉంది. అందుకే ఆయనకు ప్రతిష్టాత్మకమయిన ‘భారత రత్న’బిరుదు ఇవ్వాలని ప్రజలు కోరుకొంటున్నారు. ఇటీవలే ఆయన విగ్రహం పార్లమెంటులో అవిష్కరింపబడటం యావత్ తెలుగు జాతికి గర్వ కారణం.

 

రాష్ట్రంలో ముఖ్యమంత్రులను ఆట బొమ్మలుగా చేసి ఆడుకొంటున్న కాంగ్రెస్ పార్టీ పద్ధతి చూసి చాలా బాధ పడిన ఆయన తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన 9నెలలలోనే ఆయన తిరుగులేని మెజార్టీతో రాష్ట్రంలో తొట్టతొలి కాంగ్రెసేతర ప్రభుత్వం నెలకొల్పారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన ఆయన రాజకీయాలను, అధికార పద్దతులను పక్కన బెట్టి తన అంతరాత్మకే ఎక్కువ ప్రాదాన్యమిస్తూ ప్రజల సమస్యలకు మనసుతో స్పందిస్తూ పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు.

 

బహుశః ఆ కారణంగానే, టంగుటూరి ప్రకాశం పంతులు గారి తరువాత ఇంతవరకు మరే ముఖ్యమంత్రి ప్రజలకి చేరువకానంతగా ఆయన చేరువకాగలిగారు. కానీ, ఆయనలో రాజకీయాలకు అసలు నప్పని నిరాడంబరత, అధికారం దర్పం, రాజకీయాలు పక్కన బెట్టి మనసుతో స్పందించే తీరు, కపటమెరుగని భోళతనం, ముక్కు సూటితనం వంటి లక్షణాలే ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి అత్యంత విషాదకర ముగింపునిచ్చాయని మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన 1996, జనవరి 18న గుండె పోటుతో మరణించారు. అయినప్పటికీ ఆయన తెలుగు చిత్ర సీమకు, తెలుగుజాతికి చేసిన మహోపకారం వల్ల ‘తెలుగు’ పదం సజీవంగా ఉన్నంతవరకూ ఆయన కూడా తెలుగు ప్రజల హృదయాలలో సజీవుడిగానే ఉంటారు. .