నిర్భయ దోషులు నలుగురికీ మార్చి 3న ఉరి!

ఢిల్లీలో

సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నిందితులకు పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. మార్చిన 3వ తేదీ ఉదయం ఆరు గంటలనకు దోషులైన నలుగుర్నీ ఉరి తీయాలని న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. అయితే తాజాగా వెల్లడించిన తీర్పుతో తిహార్ జైల్లో మార్చి 3వ తేదీన నలుగుర్నీ ఒకేసారి ఉరి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిర్భయ కేసు ఉరిశిక్ష ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

గతంలోనే నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి1వ తేదీన ఉరి తీయాల్సి ఉంది. కానీ.. కోర్టు ఆదేశాలతో ఉరి శిక్ష అమలును నిలిపేయాలని పాటియాల కోర్టు జనవరి 31న తీర్పు చెప్పింది. దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదని కూడా స్పష్టం చేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ.. కేంద్రం హైకోర్టుకు వెళ్లగా.. ట్రయల్ కోర్టు తీర్పును న్యాయస్థానం సమర్థించింది. కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లింది. నిర్భయ దోషులు పవన్‌ గుప్తా, వినయ్ కుమార్‌ శర్మ, అక్షయ్ కుమార్‌, ముఖేష్‌ కుమార్‌ సింగ్‌లకు జనవరి 22ను ఉరితీయాలంటూ జనవరి 17వ తేదీన పాటియాలా హౌస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో ఆ దోషులు అప్పీలు చేయడంతో ఉరి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు జనవరి 17న రెండోసారి డెత్ వారంట్ జారీ చేసినప్పటికీ.. దోషుల తరపు న్యాయవాది వాదనలను వినిపిస్తూ... ఒకరి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లోనే ఉందని. నిబంధనల మేరకు మిగిలిన ముగ్గుర్ని ఉరి తీయడం సాధ్యం కాదని తెలిపారు. ఇప్పుడు కోర్టు డెత్ వారంట్ జారీ చేయడంతో నిర్భయ తల్లి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.