డ్రంకన్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిన యాంకర్‌ ప్రదీప్

తెలుగు నాట యాంకర్ అంటే మహిళలే అన్న నానుడిని కొట్టిపారేసి.. వారికి సమానంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు ప్రదీప్. గత ఏడాది వరుస ఈవెంట్లు, షోలతో బిజీగా గడిపిన ప్రదీప్.. కొత్త ఏడాది కూడా అలాగే సాగిపోవాలనుకున్నాడు.. ఫ్రెండ్స్‌తో కలిసి న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్న ప్రదీప్ ఫుల్లుగా తాగాడు.. డిసెంబర్ 31 అర్థరాత్రి హద్దు మీరితే తాట తీస్తామన్న పోలీసులు అన్నట్లుగానే యువతపై కఠినంగా వ్యవహరించారు. జంటనగరాల్లో 50కి పైగా డ్రంకన్ డ్రైవ్‌లు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 45లో జరిగిన తనిఖీల్లో యాంకర్ ప్రదీప్ దొరికిపోయాడు. టీఎస్ 07 ఈయూ 6666 కారులో డ్రైవింగ్ చేస్తూ వచ్చిన ప్రదీప్‌ను బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా.. 178 పాయింట్ల రీడింగ్ చూపించింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి.. కారును పోలీసులకు అప్పగించి.. మరో వాహనంలో వెళ్లిపోయారు.. ప్రదీప్‌ను రేపు కోర్టులో హాజరుపరచనున్నారు.