ఎన్.డి.ఎం.ఎ.: శశిధర్‌రెడ్డి ఇంటికి!

 

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి తన పదవి నుంచి తప్పుకున్నారు. ఎన్డీఎంఏ పదవుల నుంచి తప్పుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో శశిధర్ రెడ్డితోపాటు పాటు ఆ సంస్థకు చెందిన ఐదుగురు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. శశిధర్‌రెడ్డితో పాటు ఎన్డీఎంఏ సభ్యులుగా వ్యవహరిస్తున్న సీఐఎస్‌ఎఫ్ మాజీ డెరైక్టర్ జనరల్ కె.ఎం.సింగ్, పౌర విమానయూన శాఖ మాజీ కార్యదర్శి కె.ఎన్.శ్రీవాస్తవ, మేజర్ జనరల్ (రిటైర్డ్) జె.కె.బన్సల్, బాబా అణు పరిశోధన సంస్థ (బార్క్) మాజీ డెరైక్టర్ బి.భట్టాచార్జీ, సీబీఐ మాజీ ప్రత్యేక డెరైక్టర్ కె.సలీం అలీ రాజీనామాలు చేశారు. 2005లో ఎన్డీఎంఏ సభ్యుడిగా నియమితులైన శశిధర్‌రెడ్డి, 2010 డిసెంబర్‌లో సంస్థ ఉపాధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. రాజీనామా అనంతరం శశిధర్ రెడ్డి స్పందిస్తూ తాను తన పదవికి మంగళవారం నాడే రాజీనామా లేఖను ప్రధాని కార్యాలయానికి పంపానని, తనను రాజీనామా చేయాల్సిందిగా ఎవరూ ఆదేశించలేదని, తాను స్వచ్ఛందంగా రాజీనామా చేశానని వివరించారు. ఇదిలా వుండగా, గవర్నర్ల వంతు పూర్తయింది. ఎన్డీఎంఏ పని పూర్తయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సంస్థల మీద కూడా దృష్టి సారించింది. జాతీయ మహిళా కమిషన్, ఎస్టీ, ఎస్సీ కమిషన్, భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్)ల అధిపతులు, సభ్యులను సైతం తమ పదవులకు రాజీనామా చేయూల్సిందిగా కేంద్రం ఆదేశించినట్లు సమాచారం.