కాంగ్రెస్ నుంచి విముక్తే ఎన్టీఆర్‌కు నివాళి : మోడి

 

అంద‌రు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మోడి ప్రసంగం అనుకున్నట్టుగా అంద‌రిని ఆక‌ట్టుకుంది. మొద‌ట త‌న ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోడి తరువాత త‌న మార్క్ విమ‌ర్శనాస్త్రాల‌తో కాంగ్రెస్ పార్టీపై విరుచు ప‌డ్డారు. త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన‌ 85 ఏళ్ల వృద్ధురాలికి, స్వాతంత్య సమర యోధులకు పాదాభివందనం చేసి ఆయన ప్రసంగాన్ని మొద‌లు పెట్టారు. దేశం ప్రస్తుత పరిస్థితుల నుంచి త్వరలోనే బయటకు రావాలని కోరుకుంటున్నాన్నరు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచనం దినం అని.. అలాగే నా పుట్టిన రోజు కూడా  అదే రోజని ఆయన తెలిపారు.

ప్రసంగం అంతా ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌భ‌లాగే జ‌రిగింది. యుపిఏ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్న ఆయ‌న‌ కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్కు సద్బుద్ధి ప్రసాదించమని దేవుడిని ప్రార్ధిస్తున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజ‌ల‌కు న‌మ్మ‌కం పోయింద‌ని దేశ ప్రజలు కాంగ్రెస్ నుంచి విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు.

ప్రస్థుతం రాష్ట్రంలోనె  కొన్న ప‌రిస్థితుల‌ను కూడా మోడి త‌న ప్రసంగంలో ప్రస్థావించారు. తెలుగు ప్రజ‌లు రెండు వ‌ర్గాలు విడిపోయి ఘ‌ర్షణ‌లు ప‌డ‌టానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అన్నారు. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే సీమాంద్ర అభివృద్ధికి కృషి చేస్తామ‌న్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఇచ్చే ఉద్దేశ్యం ఉంటే 2004లోనే ఎందుకు తెలంగాణ ప్రక్రియ  మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. తెలుగు నేల మీద కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఏర్పడటానికి ఎన్టీఆరే కారణం అన్న ఆయ‌న కాంగ్రెస్ నుంచి దేశానికి విముక్తి లభిస్తేనే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అన్నారు.