లోకేష్ భవిష్యత్ కోసం చంద్రబాబు ఆరాటం

 

 

జూ.యన్టీఆర్ ఈ రోజు తాతాగారి 90వ జయంతి సందర్భంగా సతీ సమేతంగా నివాళులు అర్పించడానికి యన్టీఆర్ ఘాట్ కి వచ్చారు. అయితే, ఊర్లోనే జరుగుతున్న మహానాడు సమావేశాలకి మాత్రం తనని ఎవరూ పిలవనందున వెళ్ళలేదని చెప్పారు. ఒకవేళ పిలిచి ఉంటే తప్పకుండా వచ్చేవాడినని అన్నారు కూడా. అతని తండ్రి హరికృష్ణ మహానాడుకి వెళ్ళినప్పటికీ అక్కడ అందరూ ఆయనతో అంటీ ముట్టనట్లే వ్యవహరించడంతో ఆయన కూడా ఏదో మొక్కుబడిగా వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయారు.

 

చంద్రబాబు తన కొడుకు లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ, “లోకేష్ వంటి విద్యావంతుడు, వ్యవహార దక్షుడు పార్టీలోకి వస్తే మంచిదేనని అన్నారు. ఇక ముందు తమ పార్టీ యువతకి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తుందని, మున్ముందు వారే పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తారని అన్నారు. లోకేష్ తో బాటు , చాలా మంది యువనాయకులు కూడా మహానాడులో హడావుడి చేయడం చూస్తే చంద్రబాబు మాటలు నిజమేనని అనిపించకమానవు.

 

కానీ మరి లోకేష్ ఈడువాడే అయిన జూ.యన్టీఆర్ ను మాత్రం మహానాడుకి ఆహ్వానించకపోవడం గమనిస్తే, అతను తన కొడుకుకి పోటీగా తయారవుతాడనే భయంతోనే చంద్రబాబు అతనిని దూరం పెట్టినట్లు అర్ధం అవుతోంది. ఒకవేళ జూ.యన్టీఆర్ కనక మహానాడుకి వస్తే అందరి దృష్టీ అతని మీదే ఉంటుంది తప్ప లోకేష్ మీద ఉండదని తెలుసు.

 

లోకేష్ ని ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకువస్తున్న చంద్రబాబు ఇటువంటి ముఖ్యమయిన సమయంలో అందరి దృష్టీ తన కొడుకు మీదే ఉండాలని కోరుకోవడం సహజం. అందువల్లే జూ.యన్టీఆర్ ను ఆహ్వానించలేదేమో. కానీ, మరి రేపు ఎన్నికల సమయంలో కేవలం లోకేష్ ప్రసంగాలతో నెగ్గుకు రావడం సాధ్యమేనా అని ఆలోచిస్తే, అప్పుడు యన్టీఆర్ అవసరం తప్పదని తెలుస్తుంది. మరి అతనిని ఇప్పుడు దూరంగా పెట్టి అప్పుడు అవసరానికి రమ్మంటే అతను వస్తాడా?

 

లోకేష్ ను తన రాజకీయవారసుడిగా చంద్రబాబు ప్రకటించుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేరేమో కానీ తేదేపాకు వారసుడని ప్రకటిస్తే మాత్రం పార్టీలోఅలజడి కలగడం ఖాయం. అయితే, ఆయన చాలా తెలివిగా హరికృష్ణకి క్రమంగా పార్టీలో ప్రాదాన్యత తగ్గించడంతో, ఆయనతో బాటు జూ.యన్టీఆర్ కూడా వెనక్కి తగ్గక తప్పలేదు. ఇక పార్టీలో ప్రస్తుతం వారిరువురూ తప్ప నందమూరి కుటుంబంలో చంద్రబాబుని వేలెత్తి చూపగలిగేవారెవరూ లేరు గనుక, చంద్రబాబు ఇక తన కొడుకు లోకేష్ పట్టాభిషేకానికి రంగం సిద్దం చేసుకోవడానికే ఉన్న ఒక్క నందమూరి వారసుడు బాలకృష్ణని దగ్గర చేసుకొన్నట్లు అర్ధం అవుతోంది.

 

బాలకృష్ణకి కూడా పార్టీ పగ్గాలు చెప్పట్టాలని మనసులో కోరిక ఉన్నపటికీ, ఎన్నికలను ఎదురుగా పెట్టుకొని అటువంటి పెద్ద బాధ్యత తలకెత్తుకోవడం తన వల్ల కాదని గ్రహించడం వలననే, లోకేష్ విషయంలో అడ్డు చెప్పడం లేదనుకోవచ్చును. పైగా అతను స్వయాన్న అల్లుడే గనుక ఇక బాలకృష్ణ అతనికి పోటీగా నిలబడే ఆలోచన కూడా చేయక పోవచ్చును. చంద్రబాబుకి కూడా ఈ విషయం తెలుసు గనుకనే బాలకృష్ణ విషయంలో నిశ్చింతగా ఉండగలుగుతున్నారు. ఇక తరువాత అంకం లోకేష్ ను ఎన్నికలలో నిలబెట్టడమే తరువాయి.

 

అయితే, రాబోయే ఎన్నికల ఫలితాలు ఎలావుంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టం గనుక, ముందుగా పార్టీ శ్రేణులకి లోకేష్ తమ తదుపరి నాయకుడనే భావం కలిగేలా తగిన కార్యక్రమాలు రూపొందించి, ఎన్నికల సమయానికి అప్పటి పరిస్థితులు అనుకూలంగా ఉంటే నేరుగా సురక్షితమయిన కుప్పం నియోజక వర్గం నుండి పోటీ చేయించడమో లేక తానే కుప్పంతో బాటు మరో చోట నుండి (శేరిలింగంపల్లి) కూడా పోటీ చేసి, ఆ తరువాత కుప్పంకు రాజీనామా చేసి కొడుక్కి చోటు కల్పించడమో చంద్రబాబు చేయవచ్చును.

 

ఒకవేళ రాబోయే ఎన్నికలలో పార్టీ విజయం సాదించి అధికారంలోకి వస్తే, అప్పుడు ఇక తన మాటకు ఎలాగు తిరుగు ఉండదు కనుక తాను ముఖ్యమంత్రి పదవిలోకి మారి తన సీట్లో లోకేష్ బాబుని కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ పార్టీ గనుక ఎన్నికలలో ఓడిపోతే, అప్పుడు కూడా తన సీట్లో లోకేష్ బాబుని కూర్చోబెట్టి ఇక తను రాజకీయాల నుండి రిటైర్ మెంట్ తీసుకోవచ్చును. అయితే ఈ కార్యక్రమమంతా వచ్చే ఎన్నికలలోగా ఒక పద్ధతి ప్రకారం జరగాల్సి ఉంటుంది గనుక, ముందుగా లోకేష్ బాటలో ఉన్న ముళ్ళను ఏరి పారేసి ఆ తరువాత కార్యక్రమానికి చంద్రబాబు నడుం బిగిస్తున్నట్లు అర్ధం అవుతోంది.

 

మరి సినిమాలతో బిజీగా ఉన్న జూ.యన్టీఆర్ ఇప్పుడప్పుడే రాజకీయాలలోకి వచ్చే అవకాశం లేదు గనుక అతను రాజకీయాలలోకి వచ్చే నాటికి లోకేష్ కి పట్టాభిషేకం చేసేస్తే ఇక చంద్రబాబు నిశ్చింతగా ఉండవచ్చునని ఆలోచిస్తున్నారేమో. ఏమయినప్పటికీ, రాబోయే ఎన్నికల తరువాత తెదేపాలో కీలక మార్పులు జరగడం మాత్రం తధ్యం.