లోకేష్ ఫైర్.. అమరావతిని పాకిస్థాన్ బోర్డర్ చేసిన వైసీపీ ప్రభుత్వం

అమరావతి రాజధాని తరలింపు పై ప్రభుత్వానికి ఇంత పట్టుదల ఎందుకని.. ఇంటికి పది మంది పోలీసులు కాపలాగా ఉండటం తగదని.. అధికార పార్టీ పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు మాజీ మంత్రి నారా లోకేష్. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన వరుస ట్వీట్ లు చేశారు. ఈ రోజున పాకిస్థాన్ బోర్డర్ ను తలపించేటువంటి రీతిలో అమరావతిని మార్చారని ప్రధానంగా లోకేష్ విమర్శించారు.పెద్ద ఎత్తున రైతులు, రైతు కూలీలు, మహిళలు రోడ్ల పైకి వచ్చి పెద్ద ఎత్తున ఒక రాష్ట్రం ఒక రాజధాని జై అమరావతి అని చాలా రోజుల నుంచి నిరసనలు చేస్తున్నారని దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని లోకేష్ తెలియజేశారు. 2014 లో హైదరాబాద్ లో జరిగిన శాసన సభలో జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని రాజధానిగా అంగీకరించి ఇప్పుడు నిరాకరించడం మంచిది కాదని లోకేష్ వెల్లడించారు. 

జగన్ గారు అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలంటే ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు ఎక్కువ నిధులు కేటాయించాలి.. కానీ గత ఎనిమిది నెలలుగా ఆ ప్రాంతానికి కేటాయించింది సున్నా అని కేవలం ఒక్క పులివెందుల నియోజకవర్గానికే మూడు వేల కోట్లు కేటాయించం పట్ల లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపూర్ కి కియా మోటార్స్ ని, చిత్తూరు జిల్లాకి సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలని తీసుకురావటం.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఫిషరీస్ ని పెద్దెత్తున ప్రోత్సహించటం.. విశాఖపట్నంకి ఐటీ పరిశ్రమలను తీసుకురావటం.. ఒక పెద్ద పేపర్ ఇండస్ట్రీ అయిన ఏషియన్ పేపర్ ను ప్రకాశం జిల్లాకు తీసుకురావటం ఇవన్నీ అభివృద్ధి వికేంద్రీకరణ చర్యలుగా ప్రభుత్వానికి కనిపించలేదా అని లోకేష్ నిలదీశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిందంటే కేవలం తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. అవగాహన లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అభివృద్ధి కొరకై వచ్చిన పరిశ్రమలను పంపిస్తే అభివృద్ధి వికేంద్రీకరణ ఎక్కడ జరుగుతుందని లోకేష్ ఆరోపించారు.