చావుతో చెట్టా ‘పట్టాల్‌’...

 

 

 

అనంతపురంలో మరో ఘోరప్రమాదం. రైలు పట్టాలపై మ్రత్యుఘోష. తెల్లవారుజాము సమయంలోనే 26 జీవితాలు తెల్లవారిపోయాయి. ఆ తర్వాత ఏమి జరిగింది? ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ సంతాపం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి కాస్త తీరిక చేసుకుని వచ్చి పోయినోళ్లను ఎలానూ తేలేం కాబట్టి తలా రూ.5లక్షల నష్టపరిహారం, ప్రమాదంపై కమిటీ వేస్తానని ప్రకటించేసి వెళ్లిపోయారు. రోజంతా బుగ్గయిన బోగీ చుట్టూ కెమెరా తిప్పి తిప్పి, వాయిస్‌ ఓవర్‌లు చెప్పిచెప్పి అలసిపోయిన మీడియా ఫ్రెండ్స్‌ కూడా శాంతించారు. పొద్దున్నే ఇంటికి వస్తారని చూస్తున్న తమవారు రారని, ఇక వచ్చే అవకాశమే లేదనే విషయం ఇక ఇప్పుడు సంపూర్ణంగా అర్థం అవుతున్న దశలో... చనిపోయిన వారి కుటుంబాలలో ఎన్ని కళ్లు కన్నీళ్ల సముద్రాలు కడతాయో... ఎన్ని ఇళ్లు అతలాకుతలం అవుతాయో... ఎన్ని జీవితాలు చిందరవందరగా మారతాయో... రైలెక్కడం అనేది ఇంత పెద్ద నేరమా? అని ఎంతమంది భయపడిపోతారో...


గత కొన్నేళ్ళుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేశాఖగాని, కేంద్రప్రభుత్వం గాని తమకు చీమ కుట్టినట్టయినా లేదని తరచు నిరూపించుకుంటూనే ఉంది. ప్రత్యక్షంగా జరిగే నష్టాన్ని మాత్రమే చూస్తున్న ‘పై’ వారికి పరిహారం ఇస్తే సరిపోతుందనిపిస్తుందేమో... కాని ఈ తరహా ప్రమాదాల కారణంగా తలెత్తే అనుబంధ కష్టాలు ప్రభుత్వాలకు అర్థమైతే... ఈపాటికే రైల్వేశాఖ పటిష్టమైన చర్యలు ప్రకటించేంది. కాలయాపన కమిటీలు, పరిహారాలతో ప్రజల్లో పేరుకుపోతున్న అభధ్రతాభావాన్ని పెంచడం మానేసేది.



    తెల్లవారుజామునే జరుగుతున్న ప్రమాదాలు కనురెప్పపాటులో మనిషిని ‘మసి’చేస్తున్న కారణాలను శరవేగంగా అన్వేషించే యత్నం ఇప్పటికీ జరగడం లేదు. గతంలో వేసిన కమిటీల సిఫార్సులు ఏమయ్యాయో తెలీదు. రైల్వేలో సుశిక్షుతులైన సిబ్బంది నియామాకం ఎందుకు చేయరో తెలియదు. అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితో నెట్టుకు రావడం వల్ల కలుగుతున్న నష్టాలపై విశ్లేషణ లేదు. రైళ్లు ఢీ కొనడం సంఘటనలు తగ్గి, అగ్నిప్రమాదాలు ఎందుకు పెరిగాయో అర్థం చేసుకునే ప్రయత్నం లేదు. అనిల్‌కకోడ్కర్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయరు గాని మరిన్ని కమిటీలు వేసి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తూ ఉంటారు. ప్రమాదాలు జరగనే కూడదని, జరగవని ఎవరం అనం... అయితే ఒక ప్రమాదం మరిన్ని ఘోరాలు జరగకుండా అరికట్టేందుకు దోహదపడాలిగా... అది కూడా జరగకపోవడమే రైలు పట్టాలతో చావును చెట్టాపట్టాలేయిస్తోంది. ఓల్వో బస్సుల నుంచి రైలు బోగీల దాకా బుగ్గిగా మారేందుకు కారణమవుతోంది.